మంత్రి వస్తే.. మాకేంటి..! | - | Sakshi
Sakshi News home page

మంత్రి వస్తే.. మాకేంటి..!

Aug 9 2026 1:58 AM | Updated on Aug 9 2026 1:58 AM

దత్తిరాజేరు: మండలంలోని వింద్యవాసి గ్రామంలో శనివారం జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రైతులు ముఖం చాటేయడంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని రామమందిరం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వచ్చే సమయానికి కేవలం ముగ్గురు నలుగురు రైతులు తప్ప ఎవరూ హాజరు కాలేదు. దీంతో చేసేది లేక పోలీసులు అక్కడక్కడ ఉన్న వారందరిని పిలిచినా రాకపోవడంతో ఇతర గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలే కుర్చీల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. మంత్రి వేదిక మీద కూర్చునే సమయానికి కూడా రైతులను అందుబాటులో ఉంచలేకపోయారని ఆర్‌డీఓపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఒక సమయంలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గ్రామస్తులకు పథకాలు అందకపోవడంతో బాయ్‌కాట్‌ చేశారని కొందరు చర్చించుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా గ్రామంలో రీసర్వే చేసిన తన పేరున ఉండాల్సిన భూమి తక్కువగా ఉందని రైతు కోలా జగదీశ్వరరావు నిలదీయడంతో మంత్రి తరువాత మాట్లాడుదామని రైతుని కూర్చోమని సముదాయించారు. రీసర్వే ప్రొఫైల్‌ తేలేదని.. రైతులను తీసుకురాలేకపోయారని తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా గొభ్యంలో జరిగిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో గ్రామ నాయకుల మధ్య మంత్రి ఉంటుండగానే తీవ్ర వాగ్వాదం జరగడంతో మంత్రి చేసేది లేక రెండు గృహాలు వద్ద ఫొటోలు తీసుకొని కాసేపు రామమందిరంలో సేదదీరి వెనుదిరిగారు. ముందుగా దత్తిరాజేరు కేజీబీవీ ఆవరణలో డార్మెటరీ గదులను, ఎంఈఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్‌.తాత, తహసీల్దార్‌ హరికిరణ్‌, ఎంఈఓ వెంకటరావు, సుధాకర్‌, సర్వశిక్ష అభియాన్‌ ఈఈ మురళి, డీఈ ప్రసాద్‌, ఏఈ ఉపేంద్ర, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

వింద్యవాసిలో పాస్‌ పుస్తకాల

పంపిణీకి ముఖం చాటేసిన రైతులు

అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కొండపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement