రామభద్రపురం: వెన్నుపోటు పార్టీ నాయకత్వం మెప్పు కోసమే వైఎస్సార్‌సీపీ చేపట్టిన శాంతియుత నిరసన దీక్షలపై విజయవాడలో టీడీపీ శ్రేణులు పాశవిక దాడులకు పాల్పడ్డాయని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మండిపడ్డారు. పార్టీ మండల కార్యాలయంలో విలేకరులతో శనివారం వారు మాట్లాడారు. ఇటీవల కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన బొండా ఉమను వెన్నుపోటు పార్టీ అధినాయకత్వం ప్రశ్నించడంతో అధిష్టానం వద్ద మార్కులు కొట్టేందుకు ఇటువంటి నీచమైన సంస్కృతికి తెరతీశారని ధ్వజమెత్తారు. పోలీసుల సమక్షంలోనే దీక్షా శిబిరాలపై కోడి గుడ్లు, టమాటాలు, నీళ్ల బాటిళ్లు విసిరి బీభత్సం సృష్టించడం హేయమైన చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, నిరుద్యోగులకు భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో శాంతియుత దీక్షలు కొనసాగుతుంటే ప్రజాదరణను చూసి ఓర్వలేక దీక్షా శిబిరాలపై పచ్చమూకలు దాడులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దిశ చట్టాన్ని తీసుకువస్తే వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు. మంత్రి వర్గ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి వెంట ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, జెడ్పీటీసీ అప్పికొండ సరస్వతి, మండల జేసీఎస్ కన్వీనర్ చింతల సింహాచలంనాయుడు, తెర్లాం మండల పార్టీ అధ్యక్షుడు తెంటు సత్యంనాయుడు తదితరులు ఉన్నారు.
దిశ చట్టాన్ని ఉపసంహరించు
కోవడం హేయమైన చర్య
మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే శంబంగి


