ఒకరికి ఒకరే..! | - | Sakshi
Sakshi News home page

ఒకరికి ఒకరే..!

Aug 8 2026 12:41 AM | Updated on Aug 8 2026 12:41 AM

జియ్యమ్మ వలస రూరల్‌: ఒకే విద్యార్థి..ఒకే..ఉపాధ్యాయుడితో మండలంలోని జోగులడుమ్మ పాఠశాల పనిచేస్తోంది. విద్యాశాఖలో జరుగుతున్న ఈ వింతపోకడను చూస్తున్న జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకపక్క పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ పాఠశాలలు వెలుస్తుంటే మరోపక్క ఎంపీపీ, యూపీ పాఠశాలలను ఎత్తేసే క్రమంలో ప్రభుత్వ విద్యను పేద కుటుంబాలకు దూరం చేసే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేపు ఈ పాఠశాలలన్నీ ఎన్నికల్లో ఓట్లు వేసే పోలింగ్‌ కేంద్రాలుగా మారిపోతాయా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. గత ఏడాది ఒకే విద్యార్థితో ఉన్న నీలమాంబపురం పాఠశాల నేడు కనుమరుగైందని అంతేకాకుండా మండలంలో అనేక చోట్ల నలుగురు, ఐదుగురు విద్యార్థులతో పాఠశాలలు నిర్వహిస్తున్నారంటే విద్యాశాఖ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క బీజేపురంలో ఈ ఏడాదే ప్రారంభమైన శ్రీ ఆదిత్య విద్యా మందిర్‌ పాఠశాలకు సుమారు 50 మంది విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అదే బీజేపురంలో వివేకవర్ధిని పాఠశాలలో 150, పెదమేరంగి సత్య కై లాస్‌ పాఠశాలలో 130 మంది, తిరుమల సాయి పాఠశాలలో 460 మంది, ఎస్‌ఎస్‌కేపీ పాఠశాలలో 147 మంది విద్యార్థులతో ప్రైవేట్‌ పాఠశాలలు నిర్వహిస్తుంటే ప్రభుత్వ విద్యాశాఖ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. తల్లికి వందనం పేరిట ప్రభుత్వం ప్రతి విద్యార్థికి రూ.13 వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో వేస్తుంటే కొంతమంది అప్పులు చేసి ప్రైవేట్‌ పాఠశాల వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారో దీనిపై సమగ్ర సర్వేను నిర్వహించవలసిన బాధ్యత విద్యాశాఖకు లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement