మక్కువ:/సాలూరురూరల్: ఒక్కగానొక్క వారసుడు మంచి చదువులు చదివి, కుటుంబాన్ని ఆదుకుంటాడని కలలుగన్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. తల్లిదండ్రుల కళ్లముందే రోడ్డు ప్రమాదం రూపంలో ఆ విద్యార్థి అనంతలోకాలకు చేరుకోవడంతో వారి రోదన అంతుపట్టలేకుండా ఉంది. హృదయ విదారకమైన ఈ సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మక్కువ మండలం కవిరిపల్లి గ్రామానికి చెందిన భద్రాది అఖిల్ (15) సీతానగరం మండలం జోగింపేట పాఠశాలలో పదవతరగతి చదువుతున్నాడు. నాన్నా నీరసంగా ఉంది. నన్ను ఆస్పత్రికి ఒకసారి తీసుకువెళ్లండి అంటూ కొడుకు ఫోన్‌చేయడంతో, తండ్రి శంకరరావు ఉదయం పాఠశాలకు వెళ్లి కొడుకు అఖిల్‌ను ఇంటికి తీసుకువచ్చాడు. తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్నం ఇంటివద్ద భోజనం చేసిని అఖిల్ వైద్యపరీక్షలు చేయించుకునేందుకు సాలూరు ఆస్పత్రికి ద్విచక్రవాహనంపై తల్లిదండ్రులతో కలిసి బయల్దేరాడు. సాలూరు మండలం పందిరిమామిడివలస గ్రామం సమీపంలో ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో ట్రాక్టర్ వెనుకభాగానికి తగలడంతో ద్విచక్రవాహనంతో పాటు రహదారిపై ముగ్గురూ బోల్తా పడ్డారు. దీంతో గాయాలపాలైన అఖిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో తండ్రి శంకరరావు గాయాలపాలయ్యాడు. సాలూరు రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అఖిల్
వైద్యపరీక్షలు చేసుకునేందుకు వెళ్తుండగా ప్రమాదం
ప్రాణాలు కోల్పోయిన పదవతరగతి విద్యార్థి అఖిల్
తండ్రి శంకరరావుకు గాయాలు


