● అజయ్‌బాబుపై అపూర్వ అభిమానం చూపిన గ్రామస్తులు
నెల్లిమర్ల రూరల్: కామన్వెల్త్ గేమ్స్‌లో వెండి పతకం సాధించి జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చిన వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు శుక్రవారం తన స్వగ్రామం కొండవెలగాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విజయనగరం ఎత్తు బ్రిడ్జి వద్ద నుంచి అజయ్ బాబును ర్యాలీగా కొండవెలగాడకు తీసుకువెళ్లారు. దారిపొడవునా అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అజయ్‌కు అభినందనలు తెలిపారు. జెడ్పీటీసీ గదల సన్యాసి నాయుడు, ఎంపీటీసీ మొయిద అక్కోజీ, చంద్రంపేట సర్పంచ్ కర్రోతువెంకట రమణ తదితరులు అజయ్ బాబును సత్కరించి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి పతకం సాధించడం జిల్లాకు, స్వగ్రామానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. గ్రామానికి చేరుకున్న అజయ్ బాబుకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
విజయనగరంలో సత్కారం
విజయనగరం: గ్లాస్గోలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన జిల్లా క్రీడాకారుడు వల్లూరి అజయ్ బాబుకు ఘన స్వాగతం లభించింది. పోటీలు ముగించుకుని శనివారం జిల్లా కేంద్రానికి చేరుకున్న అజయ్‌ను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుశ్శాలువాతో సత్కరించారు. అదేవిధంగా జిల్లా క్రీడాఫ్రాధికార సంస్థ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.


