● ఆత్మ సౌజన్యంతో కార్యక్రమం
● క్షేత్రస్థాయిలో వరిసాగును పరిశీలన
వేపాడ: ఖరీఫ్ సీజన్‌పై ఎల్‌నినో ప్రభావం వల్ల కలిగే నష్టాలను అధిగమించేందకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులపై జిల్లా శాస్త్రవేత్త లక్ష్మణ్ రైతులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ మేరకు గురువారం వేపాడ మండలంలోని చినదుంగాడలో వ్యవసాయశాఖ మండల ఏఓ స్వాతి ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా శాస్త్రవేత్త లక్ష్మణ్ రైతు శిక్షణ కేంద్రం అధికారిణి నిర్మల మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా ఉంటాయని దీనికి ప్రత్యామ్నాయంగా చోడి, కొర్ర తక్కువ నీరు అవసరం ఉన్న పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. సైంటిస్ట్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఎల్‌నినో వల్ల వర్షాలు లేక నారుమడి ఎక్కడైనా ఎండిపోయినట్లయితే 19.19.19ని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి నారుమడి అంతా పిచికారీ చేసినట్లయితే నీటి ఎద్దడి నుంచి వరి నారును కాపాడుకోవచ్చునని వరి పంటలో స్వల్పకాలిక రకాలు వెద పద్ధతిలో సాగుచేసుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారం కూడా వర్షాలు లేకపోతే చోడి, కొర్ర లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు. అలాగే పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోవడం వల్ల 6–8 టన్నుల సేంద్రియ ఎరువు భూమిలో చేరి 50% వరకు ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చునన్నారు. కొత్తవలస ఏడీఏ భానులత మాట్లాడుతూ ఇన్సూరెన్స్ చేసుకోవాలని వరి పంటకు ఎకరాకు రూ.200 చొప్పున చెల్లిస్తే రూ.40,000 వరకు ఇన్సూరెనన్స్ కవర్ అవుతుందని, నారు వేసిన వారు, వెద పద్ధతిలో సాగు చేసిన వారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేపాడ, వీలుపర్తి, కుమ్మపల్లి వీఏఏలు వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


