పార్వతీపురం రూరల్/సీతానగరం: మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం సీతానగరం మండలం నుంచి పార్వతీపురం వెళ్తున్న క్రమంలో చినబోగిలి వద్ద జరిగిన ఒక రోడ్డు ప్రమాదాన్ని చూసి ఆయన స్పందించిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. మార్గమధ్యంలో రోడ్డుపై గాయాలతో పడి ఉన్న బొబ్బిలి మండలం కృష్ణరాయపురానికి చెందిన శ్రీనివాసరావును గమనించిన కలెక్టర్, వెంటనే తన వాహనాన్ని నిలిపివేశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాధితుడిని తాను ప్రయాణిస్తున్న అధికారిక వాహనంలోనే ఎక్కించుకొని సమీపంలోని సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ స్టాఫ్‌నర్సు శ్రీదేవి ఆధ్వర్యంలో బాధితుడికి తక్షణ ప్రథమ చికిత్స అందేలా చూశారు. డ్రెస్సింగ్ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి రోగి పరిస్థితిని పర్యవేక్షించిన కలెక్టర్, అనంతరం మెరుగైన వైద్యం కోసం తన వాహనంలోనే పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో బాధితుడిని చేర్పించి, వైద్యులతో మాట్లాడి చికిత్స నిమిత్తం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆపద సమయంలో సాక్షాత్తు కలెక్టరే అంబులెన్స్‌లా తన వాహనాన్ని మార్చి ప్రాణా లు కాపాడటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికార హోదాను పక్కనపెట్టి, సామాన్యుడి ప్రాణానికి విలువిచ్చిన కలెక్టర్ చొరవపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
● క్షతగాత్రుడి సేవలో కలెక్టర్
● చినబోగిలి వద్ద రోడ్డు ప్రమాదం..
● తన వాహనంలోనే ఆస్పత్రికి తరలింపు


