● 40 డిగ్రీలు దాటుతున్న వైనం
● రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం
● ప్రజల్లో ఆందోళన
పాలకొండ రూరల్: సూర్యుడి ప్రతాపానికి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలోనే 40 డిగ్రీలను ప్రజలు చవిచూస్తున్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరగడం ఖాయమని ఎలాగని ఇప్పటి నుంచే భయాందోళనలకు గురవుతున్నారు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల ప్రభావంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భానుడు భగభగమంటున్నాడు. తన ప్రతాపం చూపిస్తున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి భానుడు విరుచుకుపడడం, మధ్యాహ్నం వేడి గాలులు తోడవడంతో ప్రధాన, అంతర్గత రహదారుల్లో జన సంచారం లేక నిర్మానుష్యంగా పట్టణం దర్శనమిచ్చింది. గతంలో పోల్చుకుంటే ప్రస్తుత ఏడాదిలో ఎలినినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తుండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. రానున్న మే నెలలో భానుడి భగభగలకు సముద్రాల్లో నీరు అసాధారణంగా వేడెక్కడంతో పాటు గాలుల ప్రభావంతో తీవ్ర నష్టం ఏర్పడుతుందని, ఆరోగ్య సమస్యలు తప్పవని ఏరియా ఆస్పత్రి ఆర్‌ఎంఓ రవికుమార్ పేర్కొన్నారు. ఈ హీట్ స్ట్రోక్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా గంటకోసారి నీటిని సేవించాలని, వృద్ధులు, చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండలో అధిక సమయం ఉండకూడదని, కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. తద్వారా వీలైనంత మేరకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు.


