ట్రస్టుకే ఎరుక! | - | Sakshi
Sakshi News home page

ట్రస్టుకే ఎరుక!

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

అక్రమాలు తెలిపినా చర్యలు శూన్యం ప్రైవేట్‌ ట్రస్టు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు

దేనికీ లెక్కలు అడగొద్దు..

చెప్పరు కూడా!

ప్రజాప్రతినిధుల మౌనం ఎందుకు?

సాక్షి, పార్వతీపురం మన్యం/గరుగుబిల్లి: ఆధ్యాత్మికతకు నిలయమైన గరుగుబిల్లి మండలం తోటపల్లి దేవాలయం.. ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. దేవదాయ శాఖ నియంత్రణలో ఉండాల్సిన ఈ ఆలయం.. కొందరి చేతుల్లో ప్రైవేట్‌ సంస్థలా మారిందన్న ఆరోపణలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. వెంకన్న భక్తుల విశ్వాసాన్ని ముసుగుగా చేసుకుని అక్రమాలు జరుగుతున్నాయా? అన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆదాయం, ఖర్చులు, సేవల నిర్వహణ.. మొత్తం కొందరి కనుసన్నల్లో నడుస్తోంది. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్య క్షేత్రం.. మరో తిరుపతిగా ఖ్యాతిగాంచిన తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ పర్యవేక్షణ దారి తప్పుతోంది. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన దేవాలయంపై కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు పెత్తనం చలాయిస్తుండటం, లక్షలాది రూపాయల నిధులు పక్కదారి పడుతుండటం భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ వ్యవహారం వెనుక దేవదాయ శాఖ అధికారుల హస్తం కూడా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్‌ వ్యక్తుల చేతిలో మొత్తం ఫండ్స్‌ ఉండగా.. పాలక మండలి సైతం వారి కనుసన్నల్లోనే పని చేస్తోంది.

ట్రస్ట్‌ పేరిట అడ్డగోలు వసూళ్లు..

ఆలయానికి వైభవం తీసుకొచ్చేందుకు, నియంత్రణ కోసం కొందరు వ్యక్తులతో ప్రైవేట్‌ ట్రస్టును గతంలో ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో కార్యకలాపాలు బాగానే సాగినా.. తర్వాత కాలంలో పర్యవేక్షణ లేక పూర్తిగా అదుపు తప్పింది. దేవదాయ శాఖ నుంచి ఎటువంటి అనుమతులూ లేకుండానే ఈ ట్రస్ట్‌ కార్యకలాపాలు సాగిస్తోంది. సభ్యత్వాల పేరిట దందా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ట్రస్టీ నుంచి రూ.11,116 చొప్పున వసూలు చేశారు. ఇప్పటివరకు సుమారు 700 మంది సభ్యులు చేరినట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం ట్రస్ట్‌ వద్ద రూ.70 లక్షలకు పైగా నగదు ఉండాలి. ఈ నిధులు ఎక్కడ ఉన్నాయి? ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయి? అనే దానిపై స్పష్టత లేదు. ఆలయంలో ప్రస్తుతం కనీసం అర్చకులు కూడా లేని దైన్య స్థితి నెలకొంది. దేవదాయ శాఖ పర్యవేక్షణ లేకుండా, ప్రైవేట్‌ వ్యక్తులే లడ్డూలు తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నారు. ఇది భక్తుల ఆరోగ్యంతో ఆడుకోవడమేనన్న విమర్శలు వస్తున్నాయి. ‘అన్నదాన కమిటీ’ పేరుతో ప్రజల నుంచి భారీగా విరాళాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ఆలయంలో మైకు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. ఇలా భక్తుల నుంచి వారానికి రూ.లక్ష వరకూ వస్తోంది. ఈ నిధులను ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయకుండా.. ప్రైవేట్‌ వ్యక్తులు తమ సొంత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విరాళాలకు బిల్లులు ఇస్తున్నారు.. ప్రైవేటు వ్యక్తులతో ఆడిట్‌ చేయిస్తున్నారు. ఎక్కడా లెక్కలు మాత్రం బయట పెట్టడం లేదు.

దాతల సహకారం.. నిధులు కై ంకర్యం

తోటపల్లి ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వ హయాంలో రూ.80 లక్షల వరకూ నిధులు మంజూరయ్యాయి. ఆ మొత్తంతో ఆలయ నిర్మాణం, ధ్వజ స్తంభం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఈఓ మారారు. పనులు మందగించాయి. ప్రహరీ నిర్మాణం ఈశాన్యానికి చేపట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇటీవల రూ.2.50 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇందులో రూ.1.50 కోట్లు వివిధ పనులకు కేటాయించారు. మాస్టర్‌ ప్లాన్‌లో ఆలయ మాడ వీధులకని పేర్కొన్నా.. గుడి గుమ్మం ముందుకే పరిమితం అయ్యాయి. పరిశీలన, పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారు. కట్టడం.. తీయడం.. ఇదే కొద్ది రోజులుగా సాగుతోంది. ఆలయ పనులు చాలా వరకూ దాతల సహకారంతోనే పూర్తవుతున్నాయి. నిధులు, ఖర్చుల లెక్క ఉండటం లేదు. వుడ్‌ వర్క్‌ అంతా ఒక దాత అందజేశారు. టెక్కలికి చెందిన మరో వ్యక్తి గ్రానైట్‌ అంతా సమకూర్చారు. విశాఖకు చెందిన వైష్ణవి అనే భక్తురాలు.. ఆలయ అభివృద్ధి పనులకు రూ.50 లక్షల వరకూ విరాళం ఇచ్చారు. చిప్స్‌, సిమెంట్‌ బస్తాలు.. ఇలా చాలా వరకూ విరాళాలే. రాజగోపురంపై విగ్రహం కోసం ఓ రిటైర్డ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగి కొంత మొత్తం విరాళం ఇచ్చారు.

ఆలయం వద్ద అక్రమాలు జరుగుతున్నాయి. దేవాలయ ట్రస్టీగా బాధ్యతాయుతంగా ఈ అక్రమాలను ప్రశ్నిస్తే.. అధికారుల నుంచి సరైన స్పందన లేదు. ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోలేం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవదాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి, తోటపల్లి దేవాలయాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి.

– ప్రశాంతి, దేవాలయ ట్రస్టీ

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి మూడేళ్ల క్రితం ప్రైవేటు ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ఆలయంలో సిబ్బంది కొరతగా ఉండడం కారణంగా లడ్డూ తదితర ప్రసాదాలను ప్రైవేటు ట్రస్టే నిర్వహిస్తుంది. ప్రైవేటు ట్రస్ట్‌ ఏర్పడిన తరువాత ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గతంలోకన్నా భక్తుల సంఖ్య కూడా పెరిగింది.

– బి.శ్రీనివాస్‌, ఆలయ కార్య నిర్వహణాధికారి

ఆలయ అభివృద్ధి కోసం దాతలు సహకరిస్తున్నా.. పెద్ద ఎత్తున నిధులు వస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అర్చకులకు గృహాలు లేవు. దేవదాయ శాఖ అనుమతులు లేకుండానే ఆలయ మంటపం కూల్చివేశారు. ఇప్పటికీ పూర్తి చేయలేదు. మంటపం ఉంటే.. ఈ సమయానికి రోజుకు రెండు, మూడు వివాహాలు ఇక్కడ జరిగే వీలుండేది. ప్రైవేట్‌ ట్రస్ట్‌ సభ్యులు.. ఆలయంపై పూర్తి నియంత్రణ సాధించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో దేవస్థానం ఈఓ, చైర్మన్‌ కూడా ప్రైవేట్‌ వ్యక్తులకే వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఆలయం చుట్టూ కొద్ది రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ జగదీశ్వరికి ఈ వ్యవహారాలన్నీ తెలిసినప్పటికీ.. మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ పవిత్రతను కాపాడాలని, అక్రమ ప్రైవేట్‌ ట్రస్ట్‌ను రద్దు చేసి, సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement