పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(పీజీఆర్‌ఎస్) అర్జీల వివరాలు మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కార్యాలయల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ రోజు వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అర్జీదారులు మీకోసం.ఏపి.జిఓవి.ఇన్ వెబ్‌సైట్‌లో అర్జీలను నమోదు చేసుకోవచ్చునని సూచించారు. అర్జీల స్థితిని 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు.
108లో గిరిజన మహిళ ప్రసవం
రేగిడి/సీతంపేట: రేగిడి మండలానికి చెందిన 108 వాహనంలో పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం తురైమానుగూడకు చెందిన గిరిజన మహిళ ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట మండలం తురైమానుగూడకు చెందిన బిడ్డిక యమున పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. సీతంపేటతో పాటు పరిసర 108 వాహనాలు వేరే కేసుల్లో ఉండడంతో రేగిడి మండలం 108 వాహనానికి సమాచారం వచ్చింది. వెంటనే ఇక్కడి పైలెట్ గర్భాపు నారాయణరావు వాహనాన్ని తురైమానుగూడకు తీసుకువెళ్లగా అక్కడ యమున బంధువులు ఆమెను ఆ వాహనంలో పాలకొండ తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే యమునకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో వాహనంలో ఈఎంటీ మీసాల ఈశ్వరరావు ప్రాథమిక చికిత్సను అందించడంతో వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వారిని పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.
రామభద్రపురం: రోడ్డు ప్రమాదాల నియంత్రణే ప్రధాన లక్ష్యమని అందుకు తగ్గ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి అక్రమ రవాణా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బొబ్బిలి రూరల్, టౌన్ సీఐలు శ్రీనివాసరావు, నారాయణరావులకు పలు సూచనలు చేశారు. బ్లాక్ స్పాట్‌లతో పాటు కిలోమీటర్ దూరంలో స్టాపర్‌లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిలో జిల్లాలోని మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన సుమారు 200 మందిని జైలుకు పంపించామన్నారు. అతివేగం ప్రాణాలు తీస్తోందన్నారు. రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 200 మంది వరకు పోలీస్ సిబ్బంది కొరత ఉందని, ప్రస్తుతం పోలీస్ శిక్షణలు జరుగుతున్నందున కొద్ది రోజుల్లో స్టేషన్‌కు పది మంది చొప్పున్న సిబ్బంది నియామకం జరుగుతుందన్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరగాళ్లు రకరకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. రామభద్రపురం అంతర్రాష్ట్ర కూడలి కావడంతో గంజాయి అక్రమ రవాణా జరిగే అవకాశం ఉన్నందున నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ జ్ఞానప్రసాద్, ఏఎస్‌ఐ అప్పారావు ఉన్నారు.


