చదురుగుడికి పెదపోలమాంబ
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి మేనత్త పెదపోలమాంబ సోమవారం చదురుగుడికి చేరుకున్నారు. ముందుగా పెదపోలమాంబ అమ్మవారి ఘటాన్ని జన్నివారి ఇంటి నుంచి ఎస్.పెద్దవలస గ్రామ రహదారి వద్దనున్న అమ్మవారి గద్దె సమీపంలోకి తీసుకువచ్చి పూజలు చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ నైదాన తిరుపతిరావు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కరణం కుటుంబీకులు సంప్రదాయ బద్ధంగా అమ్మవారి ఘటానికి పూజలు జరిపారు. అనంతరం మేళ తాళాలు, కోలాట ప్రద్శనలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ పెద పోలమాంబను చదురు గుడికి తీసుకువచ్చారు. అమ్మవారు గ్రామంలోని చదురుగుడిలో వారం రోజులపాటు భక్తులకు దర్శనమిస్తారు. వచ్చే ఏడాది జనవరి 5న పెదపోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 6న ప్రధాన ఉత్సవం, 7న అనుపొత్సవం నిర్వహిస్తారు. అదేరోజు శంబరపోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానించేందుకు సనప చాటింపు వేస్తారు. జనవరి 12న శంబర పోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి తీసుకువస్తారు. 13 రోజుల పాటు పోలమాంబ అమ్మవారు చదురు గుడిలో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 26న తొలేళ్లు ఉత్సవం, 27న సిరిమానోత్సవం, 28న అనుపోత్సవం నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బి.శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు తీళ్ల పోలినాయుడు, సర్పంచ్ సింహాచలమమ్మ, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్లు, గ్రామపెద్దలు, జన్ని, కరణం, కుప్పిలి కుటుంబీకులు పాల్గొన్నారు.
మంగళవాయిద్యాలు, కోలాట ప్రదర్శనలతో అమ్మవారికి ఆహ్వానం పలికిన భక్తులు
చదురుగుడికి పెదపోలమాంబ


