జిల్లాలో 16 కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు
● ప్రస్తుతం జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలు: 451 ● ప్రతిపాదనలను పరిశీలిస్తున్న అధికారులు
వీరఘట్టం: కొత్త పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖ ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త పంచాయతీలు కావాలంటూ పలు గ్రామాల ప్రజలు తీర్మానాలు చేశారు. వాటిని ప్రభుత్వ కార్యాలయాల్లో అందజేస్తున్నారు. పంచాయతీ విభజన చట్టం ప్రకారం తమ గ్రామాలను కొత్త పంచాయతీలుగా గుర్తించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా సోమవారం నాటికి 16 కొత్త పంచాయతీల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 451 పంచాయతీలు ఉన్నాయి. వీటిలోని కొన్ని పంచాయతీల్లో ఉన్న గ్రామాల ప్రజలు కొత్త పంచాయతీలకు దరఖాస్తు చేశారు. వీరఘట్టం మండలం నుంచి 5, గరుగుబిల్లి మండలం నుంచి 3, సాలూరు నుంచి 2, పాచిపెంట నుంచి 3, భామిని నుంచి 2, బలిజిపేట మండలం నుంచి 1 దరఖాస్తు కొత్త పంచాయతీల ఏర్పాటుకోసం అందాయి. సాలూరు మండలంలోని తోనాం పంచాయతీలో ఉన్న చిమిడివలస, కొత్తూరు గ్రామాలను మరుపెంట పంచాయతీలో అనుసంధానం చేయాలని దరఖాస్తు చేశారు.
జిల్లా వ్యాప్తంగా వీరఘట్టం, భామిని, గరుగుబిల్లి, సాలూరు, పాచిపెంట, బలిజిపేట మండలాల నుంచి కొత్త పంచాయతీలు కావాలని 16 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించాం. నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తాం.
– కొండలరావు, జిల్లా గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి


