ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు
గరుగుబిల్లి: ఉత్తరాంధ్ర చినతిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి శ్రీ కోదండరామస్వామి ఆలయం మంగళవారం చేపట్టే వైకుంఠ ఏకాదశి పూజలకు ముస్తాబైంది. ఉదయం సుప్రభాతసేవ, నిత్యారాధన, పాశుర విన్నపం, శాత్తుమురై, మంగళాశాసనం తదితర కార్యక్రమాల అనంతరం 6.30 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనం ప్రారంభమవుతుందని ఈఓ శ్రీనివాస్ తెలిపారు. వేంకటేశ్వరస్వామి ఆల యం నుంచి కోదండరామస్వామి ఆలయం వరకు స్వామివారిని హన్‌మత్ వాహనంపై తిరువీధి సేవ నిర్వహిస్తామన్నారు. పూజాకార్యక్రమాల్లో భక్తులు అధికంగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఈఓ శ్రీనివాస్ కోరారు.
కలెక్టర్‌ను సత్కరించిన రెవెన్యూ అసోసియేషన్
పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ క్లినిక్–స్పెషల్ డెస్క్‌ను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి జిల్లాలో ప్రారంభించడం సంతోషదాయకమని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అసోసియేషన్ తరఫున కలెక్టర్‌ను సోమవారం సత్కరించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్‌కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్, డీఆర్‌ఓ కె.హేమలత, సిబ్బంది పాల్గొన్నారు.
హిట్ అండ్ రన్ కేసుల బాధితులకు ఆర్థిక సహాయం
పార్వతీపురం: రోడ్డు ప్రమాదాల్లో గుర్తుతెలియని వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన(హిట్ అండ్ రన్) బాధితుల కుటుంబాలకు ఆర్థిక పరిహారాన్ని కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అందజేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బాధిత కుటుంబాలతో సమావేశమై వారికి పరిహారానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. హిట్‌అండ్ రన్ కేసులకు సంబంధించి 10మందికి గాను 9మందికి మంజూరైన పరిహారాన్ని వారి వ్యక్తిగత ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా మృతుల కుటుంబానికి రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేలు చొప్పున జమ చేసినట్లు తెలిపారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమయ్యేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.హేమలత, ఎస్‌డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, రవాణాశాఖాధికారులు పాల్గొన్నారు.
ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు


