కలిసికట్టుగా ‘జంఝావతి’ని సాధిద్దాం
గరుగుబిల్లి: ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న జంఝావతి ప్రాజెక్టు నిర్మాణసాధనకు రైతులంతా కలిసి రావాలని జంఝావతి సాధనసమితి అధ్యక్ష, కార్యదర్శులు చక్క భాస్కరరావు, మరిశర్ల మాలతీకృష్ణమూర్తి నాయుడు పిలుపునిచ్చారు. గరుగుబిల్లి మండలంలోని ఉల్లిభద్ర, దళాయివలస, ఉద్దవోలు, శివరాంపురం తదితర గ్రామాల్లో పర్యటించి రైతులు, పెద్దలతో కలిసి మాట్లాడారు. సమస్యపై చర్చించి కరపత్రాలు అందజేశారు. జంఝావతి ప్రాజెక్టును పాలకులు ఎన్నికల హామీగానే చూస్తున్నారే తప్ప పూర్తిచేసేందుకు శ్రద్ధ వహించడం లేదన్నారు. సాగునీరు అందక, పంటలు పండక ఈ ప్రాంత రైతులు పేదరికాన్ని అనుభవిస్తున్నారన్నారు. రైతులు ప్రశ్నించడంలేదనే సాకుతో పాలకులు పట్టించుకోవడం లేదని తెలిపారు. రైతులు ప్రశ్నించినప్పుడే ప్రభుత్వాలు దిగివచ్చి రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. జంఝావతి నిర్మాణం పూర్తికోసం బాధిత గ్రామాల రైతులతో సమితులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.


