
బదిలీ కోసం ఎంఈవో1ల నిరీక్షణ
● విద్యాశాఖ డైరెక్టర్‌కు లేఖ
● అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం
పార్వతీపురం టౌన్: ఎంఈఓ 1లకు సాధారణ బదిలీలు కూడా నిర్వహించినట్లైతే రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎంఈఓలకు ఉపయోగకరంగా ఉంటుందని ఎంఈఓ 1 అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం అన్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయ్ రామరాజుకు అసోసియేషన్ పక్షాన లేఖ రాసినట్లు ఆయన మంగళవారం తెలిపారు. 2017 నుంచి మెజారిటీ ఎంఈఓ1లు ఎనిమిదేళ్లుగా ఒకే చోట పని చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఈఓ1 లు బదిలీల కోసం ఆశతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో అంతర్ జిల్లా బదిలీలతో పాటు ఎంఈఓ 1, 2 లకు జీరో సర్వీస్ తో సాధారణ బదిలీలు కూడా నిర్వహించేందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా విద్యాశాఖ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేసినట్లు సామల సింహాచలంతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ బుక్సా రవి నాయక్‌లు తెలిపారు.