
వెలుగులో చీకటి కోణం
● పక్కదోవ పట్టిన సీ్త్ర నిధి డబ్బుల
కలెక్షన్
● రేగులపాడు వీఓఏకు నోటీసులు ఇచ్చిన ఏపీఎం
వీరఘట్టం: మండలంలోని దశమంతుపురం గ్రామానికి చెందిన గ్రామ సంఘం సహాయకురాలు(వీఓఏ) ఇటీవల గ్రామ సంఘాల సభ్యుల నుంచి కలెక్షన్ చేసిన రూ.2 లక్షలు సీ్త్ర నిధి డబ్బులు బ్యాంకులో జమచేయకుండా సొంత అవసరాలకు వాడుకుని, అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు.ఈ డబ్బులు వెంటనే కట్టకపోతే ఆమెను విధుల నుంచి తొలగిస్తామని వెలుగు అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆమె దారిలోకి వచ్చారు. సొంత అవసరాలకు వాడుకున్న డబ్బులను చెల్లించేందుకు ఒప్పుకున్నారు.ఈ వ్యవహారం మరువక ముందే మరో వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఏపీఎం కె.రాము మంగళవారం మీడియాకు తెలిపారు.రేగులపాడు గ్రామానికి చెందిన వీఓఏ తమ గ్రామంలో గ్రామ సంఘాల నుంచి కలెక్షన్ చేసిన సీ్త్రనిధి డబ్బులు సుమారు రూ.1.18 లక్షలు పక్కదోవ పట్టించినట్లు గుర్తించామన్నారు.వెంటనే సీ్త్రనిధి లోన్ డబ్బులు కట్టకపోతే ఆమెను విధుల నుంచి తొలగిస్తామని నోటీసులు పంపించినట్లు ఏపీఎం రాము తెలిపారు. అన్ని గ్రామ సంఘాల అకౌంట్లు కొద్ది రోజుల్లో తనిఖీ చేస్తామన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కొరవడిన పర్యవేక్షణ..
వీరఘట్టం మండలంలో 50 గ్రామ సంఘాలు ఉన్నాయి. వాటి పరిధిలో 1,752 స్వయం సహాయక సంఘాలు ఉండగా 17,683 మంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వారికి సీ్త్ర నిధి కింద రూ.28.12 కోట్లు రుణాలుగా ఇచ్చారు.ఈ రుణాలను వీఓఏలు డ్వాక్రా సంఘాల నుంచి కలెక్షన్ చేసి సీ్త్రనిధి బ్యాంకు ఖాతాకు జమచేయాల్సి ఉంది. అయితే కొంత మంది డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి కలెక్షన్ చేసిన డబ్బులను బ్యాంకులకు సకాలంలో కడుతుండగా ఇంకొందరు సొంత అవసరాలకు వాడుకుని తర్వాత కడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అయితే ఇంకొందరు పూర్తిగా చెల్లించకుండా అడ్డంగా దొరికిపోతున్నారు. వెలుగు అధికారులు పర్యవేక్షణ చేసి ఉంటే ఇటువంటి తప్పిదాలు జరగవని పలువురు అంటున్నారు.
అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు
డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి కలెక్షన్ చేస్తున్న రుణాల రికవరీ డబ్బులను సకాలంలో బ్యాంకులో జమచేయాలి.అంతే తప్ప డ్వాక్రా సంఘాల మహిళల డబ్బులు సొంత అవసరాలకు వాడుకుని అక్రమాలకు పాల్పడితే అట్టివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విధుల నుంచి తొలగిస్తాం.
– కె.లలితకుమారి,
జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు

వెలుగులో చీకటి కోణం