
మంచి నీళ్లివ్వండయ్యా..!
గుమ్మలక్ష్మీపురం (కురుపాం): తమకు కనీసం తాగేందుకు మంచి నీటిని అందివ్వాలని కురుపాం మండలం వలసబల్లేరు పంచాయతీ చాపరాయిగూడ గ్రామస్తులు పాలకులను కోరుతున్నారు. గ్రామంలో నేటికీ తాగునీటి వసతులు లేకపోవడంతో సుదూరంలో ఉన్న నేలబావి నీటిని తీసుకొస్తూ తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని వారు ఆదివారం వాపోయారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో బావి నీరంతా బురదమయంగా మారిందని, ఈ నీటిని ఎలా తాగలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల కిందట తమ గ్రామానికి వచ్చిన అధికారులు గ్రామంలో బోర్ వేస్తామని హామీలిచ్చి వెళ్లిపోయారని, గ్రామానికి రోడ్డు లేదన్న సాకుతో నేటికీ బోర్ వేయలేదని, తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారు వంద మంది వరకు నివాసం ఉంటున్నామని అయినా తమ నీటి కష్టాలు ఎవరికీ పట్టడం లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి తమ గ్రామానికి మంచినీరు అందించే చర్యలు చేపట్టాలని వారు కోరారు.

మంచి నీళ్లివ్వండయ్యా..!