
మూడు ముక్కలు.. ఆరు ఆటలు!
● పేకాట స్థావరంగా మన్యం ● పార్వతీపురం మండలంలో మరోసారి పోలీసుల దాడులు ● రూ.2.23 లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం
సాక్షి, పార్వతీపురం మన్యం:
పార్వతీపురం మన్యం జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికే గంజాయి, నాటు సారా రవాణా, వినియోగం జోరుగా సాగుతున్న విషయం విదితమే. మరోవైపు పెద్ద ఎత్తున జూద స్థావరాలు కూడా వెలుస్తుండటం గమనార్హం. ఇందులో సామాన్యులు కాక.. పెద్ద తలకాయలే ఉండటం విశేషం. ఇటీవల పార్వతీపురం సమీపంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య కార్యకర్తలు పేకాడుతూ దొరికిపోయిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం పేకాట స్థావరాలపై జిల్లా పోలీసులు మెరుపు దాడులు చేశారు. పలువురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామ శివారు ప్రాంతం జీడి తోటలో గ్రామీణ ఎస్సై సంతోషి, స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది సంయుక్తంగా దాడులు చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను పట్టుకొని.. వారి వద్ద నుంచి రూ. 2,23,130లు నగదును, రెండు కార్లను, నాలుగు ద్విచక్ర వాహనాలను, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. సరదాగా కాలక్షేపం కోసం జూదం ఆడేవారి పందాలు రూ.వందలు.. రూ.వేలలోనే ఉంటాయి. ఇక్కడ రూ.లక్షల్లో నగదు లభ్యం కావడం గమనార్హం. కార్లలో వచ్చి శివారు తోటలను స్థావరంగా మలుచుకుంటున్నారు. ఎక్కువగా మారుమూల గ్రామాలు, ప్రాంతాల్లోనే పేకాట జోరుగా సాగుతోందని తెలుస్తోంది. కొంతమంది స్థానికుల సహకారంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి, ఇక్కడ జూదం ఆడుతున్నట్లు సమాచారం. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఇందులో ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో వారిని విడిచిపెట్టాలని పోలీసులకు సైతం ఒత్తిళ్లు ఉంటున్నాయి.
సీతానగరం శివారులో..
సీతానగరం మండలం, రామవరం గ్రామం శివారు ప్రాంతం లో పేకాట ఆడుతున్న వారిపై సీతానగరం ఎస్సై రాజేష్, సిబ్బంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కలిసి గురువారం ఆకస్మిక దాడి నిర్వహించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 2,330లు నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.