
కార్మికుల జీవితాల్లో కారు చీకట్లు
వీరఘట్టం: కార్మికుల జీవితాల్లో కారుచీకట్లు అలుముకున్నాయి. వారికి ఇచ్చిన ఏ హామీ అమలుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో వారంతా అయోమయంలో పడిపోయారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. ఎన్నికల సమయంలో హామీలివ్వడం..గెలిచాక ఏదో సాకుతో దానిని అమలు చేయకుండా కాలయాపన చేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటుగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో ఆరు వందలకు పైగా హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత ఆయనది. 2024 ఎన్నికల ప్రచారంలో కూడా ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ఏ ఒక్క హామీ అమలుపై కూడా మాట్లాడని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు ఫైల్‌పై పెడతామని హామీ ఇచ్చారు. అలాగే పెండింగ్‌లోని 42 వేల క్లెయిమ్‌ల పరిష్కారం, ఉచిత ఇసుకతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, 1996 భవన నిర్మాణ కార్మిక చట్టం ప్రకారం అన్నీ అమలు చేస్తామని హామీల వర్షం కురిపించారు. కార్మికుల పిల్లల చదువుకు రూ.20 వేలు, ఇన్సూరెన్స్ సదుపాయం, గర్భిణుల డెలివరీ ఖర్చులు, ఇప్పటివరకు సహజ మరణానికి చెల్లిస్తున్న రూ.లక్షను రూ.5 లక్షలకు పెంచుతాం, ప్రమాద మరణం బీమాను రూ.6 నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. ఇవన్నీ నమ్మి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తాపిమేసీ్త్రలు, తాపి పనివారు, రాడ్‌బెండర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, పెయింటర్లు, మార్బుల్ వర్కర్స్, టైల్స్ వర్కర్స్, రోజువారీ కూలీలు ఇలా అందరూ ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 80 వేల మంది భవన నిర్మాణ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారం చేపట్టి 14 నెలలు గడిచినా తమకు ఇచ్చిన హామీల అమలుపై కూటమి సర్కారు నోరు మెదపకపోవడం పట్ల కార్మికులు పెదవి విరుస్తున్నారు.
కార్మికుల ఆశలపై నీళ్లు..
కలగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు
ఎన్నికల ప్రచారంలో బోర్డును
పునరుద్ధరిస్తామని చంద్రబాబు హామీ
బోర్డు ఏర్పాటుకు రూ.కోటి ఇస్తానని తాడేపల్లి సభలో పవన్ ప్రకటన
అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా
ఆ దిశగా చర్యలు శూన్యం
ప్రభుత్వ తీరుపై కార్మికుల మండిపాటు
ఎన్నికల ప్రచారం సమయంలో తాడేపల్లిలో జరిగిన సభలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు తనవంతు సాయంగా కోటి రూపాయలు ఇస్తానని పవన్‌కల్యాణ్ ప్రకటించారు. అధికారం చేపట్టి 14 నెలలు గడుసున్నా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఆయన ఇస్తానన్న కోటి రూపాయలు ఇంకా జమ కాలేదు. భవన నిర్మాణ కార్మికులకు చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైందని కార్మికులు మండిపడుతున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, పెండింగ్ క్లెయిమ్‌ల పరిష్కారం, ఇన్సూరెన్స్, నష్ట పరిహారంపై ప్రకటన కోసం కార్మికులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నికల హామీల అమలుతో పాటు డిమాండ్ల సాధనకు కార్మికలు గతేడాది నవంబర్ 11న ధర్నాకు దిగి నిరసన కూడా తెలియజేయడం జరిగింది. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం దురదృష్టకరమని, వారి హామీలు నమ్మి మోసపోయామని కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.