
కళతప్పిన కొప్పెర్ల గురుకులం
పూసపాటిరేగ: కొప్పెర్ల బీఆర్ అంబేడ్కర్ గురుకులం... రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉన్న విద్యాలయం. 1983 జాతీయ రహదారిని ఆనుకొని సుమారు 20 ఎకరాలు విశాలమైన స్థలంలో ఏర్పాటైంది. ఇక్కడ సీటు సాధించేందుకు పోటీ పడాల్సి వచ్చేది. ఈ విద్యాలయంలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, ఎస్‌ఐలుగా, రాజకీయనాయకులుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం గురుకులం కళతప్పింది. ఇక్కడ భవనాలు శిథిలావస్థకు చేరినా పట్టించుకునేవారే కరువయ్యారు. సరైన వసతిలేక పోవడంతో తరగతి గదుల్లో విద్యార్థులు విద్యాభ్యాసంతోపాటు నివాసం ఉంటున్నారు. తరగతి గదులు, డార్మిటరీ అధ్వానంగా తయారయ్యాయి. చాలా తరగతి గదులకు డోర్లు లేవు. గు రుకులం ప్రిన్సిపాల్ చొరవతో ఉపాధ్యాయులు చందాలు వేసుకుని ఇటీవల డోర్లును ఏర్పాటుచేశారు.
సీట్లు ఖాళీ..
కొప్పెర్ల గురుకులంలో సీటు సాధిస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని భావించేవారు. నేడు అదే విద్యాలయంలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గురుకులంలో 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 620 సీట్లు ఉన్నాయి. రాష్ట్రస్థాయి అధికారుల అనుమతితో మరో 50 సీట్లలో ప్రవేశాలు కల్పించవచ్చు. అయితే, ప్రస్తుతం 420 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. సుమారు 200 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఎన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా గురుకులంలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తిచూపడంలేదు. ఎస్‌ఎంఎస్ పరిశ్రమ సహకారంతో కొన్ని తరగతి గదులు నిర్మించారు. మైలాన్ పరిశ్రమ సహకారంతో డార్మిటరీ నిర్మాణ పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. కూటమి ప్రభుత్వం శిథిల భవనాల మరమ్మత్తులకు ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గురుకులంలోని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
శిథిలావస్థలో భవనాలు
ప్రారంభానికి నోచుకోని డార్మిటరీ
గురుకులంలో చేరేందుకు విద్యార్థులు అనాసక్తి
మొత్తంగా 200 సీట్లు ఖాళీ
ఉన్నతాధికారులకు నివేదించాం
కొప్పెర్ల గురుకులంలో శిథిల భవనాల మరమ్మతుల విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. గురుకులంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. శిథిల భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు కావాల్సి ఉంది.
– అప్పారావు, ప్రిన్సిపాల్, కొప్పెర్ల గురుకులం

కళతప్పిన కొప్పెర్ల గురుకులం

కళతప్పిన కొప్పెర్ల గురుకులం