
పంద్రాగస్టు కవాతు సాధన
విజయనగరం క్రైమ్: స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణలో భాగంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసుల కవాతు సాధన గురువారం జరిగింది. ఎస్పీ వకుల్ జిందల్ వారి పరేడ్ పరిశీలనకు వెళ్లగా, వారు ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఆగస్టు 15వ తేదీన జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో మరింత ఉత్సాహంగా కవాతు చేసి, చూపరులను ఆకట్టుకునేలా ప్రదర్శన ఉండాలని ఆ దిశగా సాధన చేయాలని తెలిపారు. వేడుక చూసిన వారిలో దేశభక్తి, జాతీయ భావం పెంపొందేలా కార్యక్రమం ఉండాలన్నారు. వేడుకల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు దివ్యవాణి
మెంటాడ: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మెంటాడ మండలం, గుర్లతమ్మిరాజుపేట విద్యార్థిని అల్లు దివ్యవాణి ఎంపికై ంది. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బాపట్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో అండర్ 20 విభాగంలో జరిగిన 100 మీటర్లు, 200 మీటర్లు పరుగుపందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ మేరకు దివ్యవాణికి ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, చొక్కాపు సన్యాసినాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు తదితరులు అభినందనలు తెలిపారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
రాజాం సిటీ: స్థానిక పాలకొండ రోడ్డులోని జీఎంఆర్ ఐటీ సమీపంలో గురువారం త్రుటిలో ఓ ప్రమాదం తప్పింది. రేగిడి మండలం, సరసనాపల్లికి చెందిన వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై రాజాం నుంచి స్వగ్రామం వెళుతున్నారు. రోడ్డుపై పెద్దగోతులు ఉండడంతో ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోయారు. అదే సమయంలో రాజాం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవరు ఈ ఘటనను చూసి షడన్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు అప్రమత్తమై పడిపోయిన వృద్ధ దంపతులను పక్కకు తీసుకువెళ్లి సపర్యలు చేశారు. ఈ విషయం తెలుసుకన్న ఆర్‌అండ్‌బీ అధికారులు అప్రమత్తమై రోడ్డుపై గుంతలు పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు.
సారాబట్టీలపై పోలీసుల దాడులు
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని చెముడుగూడ పంచాయతీ, మంగన్నగూడ పరిసరాల్లో నిర్వహిస్తున్న సారాబట్టీలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎల్విన్‌పేట ఎస్‌ఐ బి.శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సారా తయారీకి సిద్ధం చేసి ఉంచిన 1400 లీటర్ల బెల్లంఊటను గుర్తించి, దానిని బయటకు పారబోశారు. అనంతరం సారా తయారీకి వినియోగిస్తున్న డ్రమ్ములను స్వాధీనం చేసుకుని వాటిని కాల్చివేశారు. ఎక్కడైనా సారా తయారు చేసినా తరలించినా సమాచారం ఇవ్వాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
పార్వతీపురం రూరల్: మండలంలోని తాళ్లబురిడి గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పార్వతీపురం రూరల్ ఎస్‌ఐ బి.సంతోషికుమారి గురువారం తెలిపారు. బుధవారం ఉదయం నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు.

పంద్రాగస్టు కవాతు సాధన

పంద్రాగస్టు కవాతు సాధన

పంద్రాగస్టు కవాతు సాధన