
సాగునీటి సరఫరాలో జాప్యం
● డీఆర్‌సీలో ప్రశ్నించిన జెడ్పీచైర్మన్
మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం అర్బన్: ప్రణాళికలు లేని పాలనవల్లే ఖరీఫ్ సాగుకు సకాలంలో సాగునీటిని అందజేయలేకపోయారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం (డీఆర్‌సీ) గురువారం నిర్వహించారు. తొలుత ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలోని తోటపల్లి ప్రాజెక్టుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో జూన్ నెలలోనే సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టులో నీరున్నా ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలని అధికారులను నిలదీశారు. కాలవల పూడిక తీత పనులు చేపట్టామని అఽధికారులు చెప్పగా ముందుగా ప్రణాళిక వేసుకోలేదా అని ప్రశ్నించారు. ఇన్‌చార్జి మంత్రి అనిత కలుగుచేసుకొని మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నీటి సంఘాలతో మాట్లాడుకోవాల్సి ఉంటుందని సమాధానం ఇచ్చారు. రైతులకు నీరివ్వడంలో ఈ ఏడాది 15 రోజులు ఆలస్యమైందని అంగీకరించారు.
● డీసీసీబీ చైర్మన్ నాగార్జున మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో ఎత్తిపోతల పథకం నుంచి రాజాం, చీపురుపల్లి ప్రాంతాలకు సాగునీరు అందడం లేదని ఆరోపించారు. బాడంగి మండలం వాడాడ గ్రామం పరిధిలోని 860 హెక్టార్ల సాగుభూమి కోసం గత ప్రభుత్వ హయాంలో ఈ ఎత్తిపోతల పథకం వినియోగంలోకి వచ్చిందని తెలిపారు. దీనిపై పూర్తినివేదిక ఇవ్వాలని హోంమంత్రి ఆధికారులను ఆదేశించారు.
● వ్యవసాయ శాఖ సమీక్షలో 5 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉన్నట్లు కలెక్టర్ బహిరంగంగానే చెప్పడం, గతంలోనే డిమాండ్ చేసినప్పటికీ ఇంకా పూర్తి సరఫరా జరగలేదని జెడ్పీ చైర్మన్ విమర్శించారు. నానో యూరియా వినియోగంపై ప్రచారం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా రైతుల్లో సందేహాలు తొలగడంలేదన్నారు.
● పరిశ్రమల సమీక్షలో జిల్లాలో మూతపడిన పరిశ్రమల జాబితాలు ఇవ్వాలని మంత్రి అనిత చెప్పడం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి స్తబ్దతను తెలియజేసింది. మహిళలకు ఉచిత ప్రయాణం కోసం సీ్త్ర శక్తి బస్సులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పినా జిల్లాలో 160 బస్సులకు కేవలం 137 బస్సులు మాత్రమే సిద్ధం కావడం, వాటిలో సీసీటీవీ అమలు వంటి పనులు ఇంకా పూర్తికాలేదని తెలియజేశారు. సమావేశంలో వైద్యశాఖ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ తదితర శాఖలపై సమీక్షించారు. ఎమ్మెల్సీలు డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, డాక్టర గాదె శ్రీనివాసులనాయుడు, ఎంపీ అప్పలనాయుడు, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్, సీపీఓ పీ.బాలాజీ, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, ఆర్‌డీఏ దాట్ల కీర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఒక్కరు మినహా ఎమ్మెల్యేలందరూ డుమ్మా
ప్రజల సమస్యలను జిల్లా స్థాయిలో పాలకులను చెప్పుకొనే అవకాశం ఉన్న వేదిక డీఆర్‌సీ. ప్రతి మూడునెలకు ఒకసారి జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరై జిల్లా అభివృద్ధికి సంబంధించిన సూచనలు, సమస్యల పరిష్కారాలు చేపడతారు. జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నెల్లిమర్ల ఎమ్మెల్లే లోకం నాగ మాధవి మినహా మిగిలిన వారంతా గైర్హాజరుకావడం గమనార్హం.