
మా భూములు మాకు ఇప్పించండి
శృంగవరపుకోట: మండలంలోని బొడ్డవారలో జిందాల్ నిర్వాసితులు నిర్వహిస్తున్న శాంతియుత నిరసన గురువారం నాటికి 53వ రోజుకు చేరుకుంది. మా భూములు మాకు ఇప్పించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కోరుతూ బ్యానర్ ప్రదర్శించారు. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ కంపెనీకి ఇచ్చిన భూముల వద్ద మీరు(పవన్ కల్యాణ్) వెళ్లి, విచారణ జరిపి అక్రమాలు జరిగాయని నిర్ధారించి భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి రైతులకు న్యాయం చేశారని గుర్తు చేశారు. అదే తరహాలో తమకు కూడా న్యాయం చేయాలని తమ భూములు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో కూడా ఓసారి పర్యటించి, తమ బాధలు వినాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు, పాలకులు తమను పట్టించుకోవడం లేదని మీరే న్యాయం చేయగలరని నమ్ముతున్నామని, మీరే రావాలని మా సమస్యలు ఆలకించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.