
దేవుడితో కూటమి ఆటలు
● ట్రస్టుబోర్డు నియామకంలో కుంపట్లు
● వంశపారంపర్య, వ్యవస్థాపక
ధర్మకర్తలకు మొండిచేయి
● నిన్న నవదుర్గామాత ఆలయం..
● నేడు పోలిపల్లిపైడితల్లి ఆలయం
రాజాం: దేవుడితోను..దేవస్థానాలతోను కూటమి ప్రభుత్వం ఆటలు ఆడుతోంది. చోటా మోటా కార్యకర్తలు, నాయకుల మాటలకు దేవదాయశాఖ తల ఊపుతోంది. నిబంధనలు ఉల్లంఘించి రాజకీయాలు చేస్తోంది. దేవాలయాల ట్రస్టు బోర్డు నియామకంలో సిఫార్సులకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. రాజకీయాలు చేసి, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోంది. హైందవ ధర్మాన్ని అటకెక్కించే పనిలో పడింది. రాజాంలో నిన్న నవదుర్గామాత ఆలయ ట్రస్టుబోర్డు కమిటీ నియామకంలో నిబంధనలు ఉల్లంఘించిన దేవదాయశాఖ, ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చిన పోలిపల్లి పైడితల్లి ఆలయం ట్రస్టు బోర్డు నియామకంలో కూడా వివాదాలకు తావిచ్చి ంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా..
ఆలయ ట్రస్టు బోర్డులు, అభివృద్ధి కమిటీల ఏర్పాటులో గత ప్రభుత్వాలు రాజకీయ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు అలా కాకుండా కూటమి కుంపటి పెడుతోంది. రాజాం బస్టాండ్ ఆవరణలోని నవదుర్గామాత ఆలయ ట్రస్టు బోర్డు ఎంపిక పక్షం రోజుల క్రితం జరిగింది. ఆ బోర్డులో ఆలయ వ్యవస్థాపక ఽకుటుంబానికి చెందిన ధర్మకర్తను చైర్మన్‌గా ఉంచాల్సి ఉండగా, ఆయనను తొలగించి, రాజాం పట్టణ పరిధిలోని సారథి గ్రామానికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త పేరును ప్రకటించింది. దీంతో ఇక్కడ పెద్దస్థాయిలో వివాదం చెలరేగడంతో పాటు వ్యవస్థాపక ధర్మకర్తలు ఈ నియామకాన్ని తిరస్కరించడంతో ప్రస్తుతం ఈ బోర్డు ఎంపిక వివాదాస్పదంగా మారి గాలిలో ఉంది. గతంలో ఈ బోర్డు ఎంపికలో ఇటువంటి ఇబ్బందులు రాలేదని, వ్యవస్థాపక ధర్మకర్త వానపల్లి తమ్మయ్య గురువు కుమారుడు వానపల్లి నర్సింగరావు తెలిపారు. ధర్మకర్త కుటుంబానికి చెందిన చైర్మన్‌గా ఉంటారని, మిగిలిన సభ్యులను దేవదాయశాఖ నియమించాల్సి ఉందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ విధానంలోనే చైర్మన్‌గా ధర్మకర్తను కొనసాగించి, ఆలయ అభివృద్ధికి సహకరించిన మిగిలిన భక్తులకు కమిటీలో చోటు కల్పించేవారని వెల్లడించారు. ఈ దఫా ఈ నిబంధనలు అటకెక్కించి, ఆలయానికి రానివారిని, ఆలయం అంటే తెలియని వారిని సభ్యలుగా పెట్టిన పరిస్థితి ఉందన్నారు.
తాజాగా మరో వివాదం
ఇదిలా ఉండగా ఇప్పుడు పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ ట్రస్టు బోర్డు ఎంపికకు దేవదాయశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో ట్రస్టు చైర్మన్ పదవిని ఖాళీ ఉంచి, మిగిలిన కమిటీకి నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాకాకుండా మొత్తం కమిటీకి దరఖాస్తులు ఆహ్వానించడంతో వివాదం ప్రారంభమైంది. కొన్నేళ్లుగా ఇక్కడ ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్‌గా ఆలయ ధర్మకర్త కుటుంబానికి చెందిన వాకచర్ల కుటుంబీకులే వ్యవహరిస్తున్నారు. గతేడాది వరకూ ధర్మకర్త కుమారుడైన వాకచర్ల దుర్గాప్రసాద్ చైర్మన్‌గా వ్యవహరించారు. పైడితల్లి అమ్మవారి ఆలయానికి సంబంధించి అన్ని ఉత్సవాల్లో వారి భాగస్వామ్యం ఉంటుంది. అటువంటి ధర్మకర్త కుటుంబాన్ని పక్కన పెట్టి, కొత్తవారికోసం నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇక్కడ వివాదం ప్రారంభమై, దేవదాయశాఖ తీరుతో పాటు కూటమి ప్రభుత్వ తీరుపై భక్తులు విమర్శలు చేస్తున్నారు. ఇంతటి దురదృష్టకర పాలనను ఇంతకు ముందు చూడలేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ కమిటీ ఎన్నిక ఎలా జరుగుతుందో చూస్తామని హెచ్చరిస్తున్నారు.
నిబంధనలు మారాయి
పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ ట్రస్టు బోర్డు కమిటీ ఎంపిక నోటిఫికేషన్ ఉన్నతాధికారుల నుంచి వచ్చింది. గతంలో వంశపారంపర్య ధర్మకర్తలే చైర్మన్‌లుగా ఉండేవారు. ఇప్పుడు కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇక్కడ పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల మేరకే నియామకం ఉంటుంది. నా చేతిలో ఏమీలేదు. బీవీ మాధవరావు,
దేవాదాయశాఖ రాజాం మేనేజర్

దేవుడితో కూటమి ఆటలు

దేవుడితో కూటమి ఆటలు