
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
డెంకాడ: మండలంలోని చింతలవలస వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం మండలంలోని ధర్మపురి గ్రామానికి చెందిన వలిపల్లి సుధాకర్(37) దివీస్ కంపెనీలో కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. బి షిప్ట్ కావడంతో బుధవారం మధ్యాహ్నం ధర్మపురి నుంచి తగరపువలస సమీపంలో ఉన్న దివీస్ కంపెనీకి వెళ్తుండగా.. చింతలవలస గ్రామం వద్ద ఎదురెదురుగా రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. దీనిలో వలిపల్లి సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సుధాకర్‌ను చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు.