
19న ఐద్వా మహాసభలు
విజయనగరం గంటస్తంభం: విజయనగరంలో ఈ నెల 19న జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 9వ మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.రమణమ్మ కోరారు. ఈ మేరకు బుధవారం స్ధానిక రామకృష్ణ నగర్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో విలేకర్లతో ఆమె మాట్లాడారు. మహిళా హక్కులు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్, అధిక ధరలకు వ్యతిరేకంగా, ప్రజాసమస్యల పరిష్కారం కోసం మహిళలపై జరిగే దాడులు, హత్యలు, ఆత్యాధారాలు, లైంగిక, వరకట్న వేధింపులు, సీ్త్ర వివక్ష, డ్వాక్రా మహిళల సమస్యలు, మైక్రోఫైనాన్స్, మద్యం, గంజాయి, డ్రగ్స్, అశ్లీలత మొదలైన సమస్యలపై జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు ఐద్వా నిర్వహిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జాప్యం చేయడం సరైంది కాదని వెంటనే ప్రతి మహిళకు రూ.1500 పథకం అమలు చేయాలన్నారు. అన్ని సర్వీసుల్లో రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా నాయకులు ఎం.జగదాంబ, కె.రమణమ్మ పాల్గొన్నారు.