
రాష్ట్ర స్థాయి పోటీలకు గంగుబూడి విద్యార్థులు
లక్కవరపుకోట : మండలంలోని గంగుబూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇటీవల లక్కవరపుకోట మండల కేంద్రం ఏపీ మోడల్ స్కూల్ మైదానంలో జరిగిన ఎంపికలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్టు పాఠశాల పీడి గాడి రవికుమార్ బుధవారం తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో గొర్లె పూర్ణచందు, జూనియర్స్ విభాగంలో వానపల్లి మనోజ్ ఎంపికై నట్టు పేర్కొన్నారు. వీరు ఈ నెల 29 నుంచి 31వ తేది వరకు ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు నుంచి ఆడుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు శారదాదేవి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వి.వి.జి.మంగరాజు తదితరులు అభినందించారు.
మారెడుబాకలో ఇరు వర్గాల కొట్లాట
రాజాం సిటీ: మండల పరిధి మారెడుబాక గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఇరువర్గాల కొట్లాటలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జరజాన కోటేశ్వరరావు, వర్రి రామకృష్ణల మధ్య చెలరేగిన స్థల వివాదం కొట్లాటకు దారితీసింది. వర్రి రామకృష్ణతో పాటు మరో తొమ్మిది మంది జరిపిన దాడిలో జరజాన కోటేశ్వరరావుతో పాటు సునీత, లత, కుంచి నిర్మల, రాయ లక్ష్మి గాయాల పాలయ్యారు. వెంటనే స్థానికులు వీరిని రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించి బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపారు.
ప్రేమ పేరుతో మోసగించిన యువకుడు అరెస్టు
తెర్లాం: ఓ యువతిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన కేసుకు సంబంధించి యువకుడిని అరెస్టు చేసినట్టు బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు బుధవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గొలుగువలస గ్రామానికి చెందిన సిరిపురపు వెంకటరమణ, అదే గ్రామానికి చెందిన యువతి గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆ యువకుడు తనను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి పెళ్లి చేసుకోమని కోరినప్పుడు పెళ్లి చేసుకొనేందుకు నిరాకరించాడని, వేరొక యువతిని పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ప్రేమించిన యువతి తాను మోసపోయానని, తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకునిపై నమ్మించి మోసం చేసినట్టుగా తెర్లాం ఎస్‌ఐ బి.సాగర్‌బాబు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు నిర్వహించిన బొబ్బిలి రూరల్ సీఐ యువతిని ప్రేమించి, మోసగించిన యువకుడిని అరెస్టు చేసి బొబ్బిలి కోర్టులో హాజరుపరచినట్టు తెలిపారు.
సెప్టెంబర్ 14న పౌరాణిక ఏకపాత్రాభినయ పోటీలు
పార్వతీపురం రూరల్: ఉత్తరాంధ్ర స్థాయిలో పౌరాణిక ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించనున్నట్టు శ్రీ వాణి ఆర్ట్స్ వ్యవస్థాపకులు డాక్టర్ పీజే నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం పట్టణంలో గల లయన్స్ కల్యాణ మండపం వేదికగా సెప్టెంబర్ 14వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ పోటీలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు పోటీలలో పాల్గొనేందుకు ఆగస్టు 25లోగా ప్రవేశ రుసుము రూ.200 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు ప్రత్యేక స్థానాలుగా గుర్తించి ప్రతిభ కనబరిచిన కళాకారులకు జ్ఞాపకతో పాటు నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఫోన్ ద్వారా నమోదు చేసుకునేందుకు 8186076044, 9849833439, 9948128766 నంబర్లను సంప్రదించాలని కోరారు. శ్రీ వాణి ఆర్ట్స్ 12వ వార్షికోత్సవ సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు గంగుబూడి విద్యార్థులు