
ఎస్‌ఎంఎస్ పరిశ్రమ ఉద్యోగి మృతి
పూసపాటిరేగ : మండలంలోని ఎస్‌ఎంఎస్ పరిశ్రమ ఉద్యోగి విధి నిర్వహణలో వుండగా అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీనివాసరావు (26) ఎస్‌ఎంఎస్ పరిశ్రమలో కెమిస్ట్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం ఏ షిప్టుకు హాజరైన శ్రీను విధులు నిర్వహిస్తుండగా ఆకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. సొమ్మసిల్లిన శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం విజయనగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పరిశ్రమ ఉద్యోగి మృతి చెందడంతో గ్రామస్తులు, మృతుని బంధువులతో మృతదేహం అంబులెన్సులో వుంచి పరిశ్రమ గేటు ఎదురుగా ఆందోళనకు దిగారు. దీనిపై యాజమాన్య ప్రతినిధులు స్పందిస్తూ పరిశ్రమలో ఎటువంటి ప్రమాదం జరగలేదని, అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు తెలిపారు. దీంతో పరిశ్రమ ఉద్యోగికి న్యాయం చేయాలని గ్రామస్తులు, మృతుని బంధువులు పట్టుబట్టడంతో యాజమాన్య ప్రతినిధులు రూ.20 లక్షలు పరిహారం ఇవ్వడానికి అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ ఆధ్వర్యంలో పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం ఎస్‌ఐలు ఐ.దుర్గాప్రసాదు, ఎ.సన్యాసినాయుడు, పాపారావు సిబ్బందితో పాటు గేటు వద్ద బందోబస్తు నిర్వహించారు.
అంబులెన్స్‌లో మృతదేహంతో గేటు ఎదుట నిరసన
పరిశ్రమ యాజమాన్యంతో ప్రజాప్రతినిధులు చర్చలు
రూ.20లక్షలు పరిహారం ప్రకటించిన యాజమాన్యం

ఎస్‌ఎంఎస్ పరిశ్రమ ఉద్యోగి మృతి