
రెండు తులాల బంగారం కోసం చిన్నాన్నని చంపేశాడు..
● నాటు తుపాకీతో హత్య చేసిన వ్యక్తి అరెస్టు
● వివరాలు వెల్లడించిన విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు
కొత్తవలస : కేవలం రెండు తులాల బంగారం కోసం జరిగిన వివాదం వరసకు చిన్నాన్న అయిన సిమ్మ అప్పారావును నాటు తుపాకీతో కాల్చి చంపడానికి దారి తీసిందని విజయగనరం డీఎస్సీ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు(70)ను తన మేనకోడలు భర్త అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు(36) ఈ నెల 5వ తేదీన అతి సమీపం నుంచి నాటు తుపాకీతో కాల్చి చంపిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ మేరకు గ్రామానికి చెందిన సిమ్మ శివకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సిహెచ్.షణ్ముఖరావు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా నిందితుడు సిమ్మ అప్పారావును కోటపాడు రోడ్డు సీతంపేట గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక విలేకరుల ముందు నిందితుడిని హాజరుపరిచి వివరాలను విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. నిందితుడు అప్పారావు భార్య ఏడాదిన్నర క్రితం మృతి చెందింది. ఆమెకు సంబంధించిన బంగారం, భూమి ఇతర ఆస్తులు మేనమామ అయిన మృతుడు సిమ్మ అప్పారావు వద్ద ఉన్నట్టు తెలిపారు. సదరు బంగారం, భూమి ఇవ్వాలని నిందితుడు అప్పారావు మృతుడు అప్పారావుని పలుమార్లు అడిగాడు. అయినా బంగారం ఇవ్వకపోవడంతో ఈ నెల 5న నిందితుడు తన స్వంత ఆటోలో ముసిరాం వచ్చి మరోసారి బంగారం ఇవ్వమని అడిగాడు. ఆయన నిరాకరించడంతో తనతో పాటు తెచ్చుకున్న నాటు తుపాకీతో గుండైపె కాల్చడంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడని తెలిపారు. సీతంపేట వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. తుపాకీ కోసం విచారించగా పాతవలస సమీపంలో వుంచినట్లు తెలపగా తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన సీఐ సిహెచ్.షణ్ముఖరావు, ఎస్‌ఐ పి.ప్రసాద్‌రావు, పీసీ లు ఎల్.రమేష్, దేముడు తదితరులను అభినందించారు. రివార్డులకు సిఫార్స్ చేస్తామని తెలిపారు.