
ఆటల్లో సత్తా చాటిన పాఠశాలలకు పురస్కారాలు
● ఈ నెల 18 లోగా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం
● జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5 పాఠశాలలకు దక్కనున్న అవార్డులు
● స్కూల్ గేమ్స్ క్రీడలో ప్రతిభ చూపిన వారికి అవకాశం
విజయనగరం: ఆటల్లో మేటిగా నిలిచే క్రీడాకారులున్న పాఠశాలలకు పురస్కారాల పంట పండనుంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలలకు క్రీడా ప్రతిభా పురస్కారాలు అందజేయాలని, ఆ మేరకు దరఖాస్తులు ఆహ్వానించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18లోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. 19న దరఖాస్తుల పరిశీలన, 20న అభ్యంతరాల స్వీకరణ, 21న తుది జాబితా ప్రకటిస్తారు.
విద్యార్థులకు ప్రోత్సాహం..
విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు పాఠశాలలకు ఏటా పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ ఏడాది హాకీ క్రీడాకారుడు ధ్యానచంద్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఆ రోజు అన్ని పాఠశాలల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నారు.
క్రీడా ఫలితాల ఆధారంగా..
ఉత్తమ పాఠశాలల ఎంపికకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని నియమించనున్నారు. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో ఐదు మంది సభ్యులుగా ఉంటారు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి అత్యధిక విజయాలు సాధించిన పాఠశాలల్లో ఐదింటిని కమిటీ గుర్తిస్తుంది. ఇందుకు ప్రతి క్రీడలో అత్యధిక స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. 2024 – 2025కు సంబంధించిన క్రీడా ఫలితాల ఆధారంగా జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలలకు పురస్కారాలు ప్రదానం చేస్తారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రదర్శనలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పాఠశాల విద్యా శాఖ పరిధిలోని అన్ని బడుల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ సంతకంతో క్రీడాకారులు సాధించిన ధ్రువపత్రాల నకళ్లతో ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న పాఠశాలలకు 29న జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేస్తారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కృష్ణంరాజు తెలిపారు.