
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
పార్వతీపురం రూరల్ : మూడవసారి అధికారంలోకి వచ్చిన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ రైతుకు ద్రోహం చేస్తున్నదని పలు రైతు సంక్షేమ, రైతుకూలి, ప్రజా సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రైతు, కార్మిక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో వ్యవసాయ రంగంలోకి ‘కార్పొరేట్’ సంస్థలను తీసుకువచ్చే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. పంటలు పండే భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఇవ్వడం సరికాదన్నారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ బంటు దాసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఈవీ నాయుడు, రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకులు పి.శ్రీనునాయుడు, కృష్ణ వేణి, ఎం.భాస్కరరావు, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు పి.సంగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తిన మోహన్, గేదెల రామకృష్ణ, వంగల దాలినాయుడు, ఏఐటీయూసీ నాయకులు ఆర్‌వీఎస్ కుమార్, దుర్గారావు, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాలక రంజిత్‌కుమార్, తాడంగి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.