
జర్మన్ భాషపై ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ
పార్వతీపురం టౌన్: జర్మనీ దేశంలో అసిస్టెంట్ నర్సు ఉద్యోగాలు పొందేందుకు జిల్లాలోని జి.ఎన్.ఎమ్ చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు జర్మన్ భాషపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓంకాప్, టి.ఎన్.ఏ.ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో శిక్షణ ఉంటుందని వివరించారు. తప్పనిసరిగా జి.ఎన్.ఎమ్ పూర్తి చేసి ఏడాది పాటు సాధారణ ఆసుపత్రుల్లో అనుభవం కలిగి 39 ఏళ్లలోపు వయసున్న వారు జర్మన్ భాష నేర్చుకోవడానికి అర్హులని తెలిపారు. శిక్షణ రోజుకు 2 నుంచి 3 గంటల పాటు సుమారు 8 నెలల వరకు ఉంటుందని అన్నారు. ఇందులో ఏ1, బీ2 లాంగ్వేజ్‌లపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రూ.30,000లు సెక్యూరిటీ డిపాజిట్ చేసి, జర్మనీ వెళ్లేందుకు విమాన చార్జీలు, బీ2 పరీక్ష ఫీజు, వీసా చార్జెస్ చెల్లించాలన్నారు. శిక్షణ పూర్తి చేసి బీ2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి నెలకు రూ.2 లక్షల నుంచి 2,50,000ల వరకు జీతం చెల్లిస్తారని పేర్కొన్నారు. వివరాలకు 7032060773 నంబరును సంప్రదించి తెలుసుకోవచ్చని తెలిపారు.
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య