
గంజాయితో సంపాదించిన ఆస్తులు ఫ్రీజ్ : ఎస్పీ
విజయనగరం క్రైమ్ : ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన గంజాయి వ్యాపారి నగేష్ అలియాస్ బాలరాజుకు చెందిన రూ.56 లక్షల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. జిల్లాలోని ఎస్.కోట పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు అయిన నగేష్ ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పంత్లున్గా పంచాయత్ నందాపూర్ మండలం భాకాపుట్ గ్రామానికి చెందిన వాడని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాతో సంపాదించిన సుమారు రూ.56 లక్షల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. గంజాయి వ్యాపారుల నుంచి అతని భార్య జమున బ్యాంకు ఖాతాకు పలుమార్లు రూ.6.53 లక్షల నగదు జమ అయినట్టు తమ విచారణలో తేలిందని తెలిపారు. నిందితుడు సంపాదించిన అక్రమ ఆస్తులను ఎవరికీ విక్రయించకుండా చట్ట పరిధిలో ఫ్రీజ్ చేసినట్టు నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ఫ్రీజ్ చేసిన ఆస్తులు కొల్‌కత్తాలోని కాంపిటెంట్ అధారిటీ పరిధిలోకి వెళ్లాయని, సదరు ఆస్తులను ఎవరు కొనుగోలు చేసినా చెల్లనేరవని ప్రజలు దీన్ని గుర్తించాలని ఎసీ కోరారు. ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పని చేసిన అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్.కోట ఇన్‌స్పెక్టర్ వి.నారాయణమూర్తి ఇతర పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.