పార్వతీపురం రూరల్: ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, జిల్లా అటవీశాఖాధికారి ప్రసూనతో కలిసి వరల్డ్ ఎలిఫెండ్ డే పోస్టర్లను మంగళవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఏనుగుల పర్యవేక్షణ అధికారి మణికంఠేష్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ ఎం.మనోజ్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
పాత మార్కొండపుట్టిలో గజరాజులు
కొమరాడ: తోటపల్లి ముంపు ప్రాంతమైన పాత మార్కొండపుట్టి గ్రామ పరిసరాల్లో మంగళవారం ఏనుగులు సంచరించాయి. వరి, పత్తి, కూరగాయలు, అరటి పంటలను నష్టపరుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎరువుల బాధ్యత ఏఓలదే : కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖాధికారులపై ఉందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లాలో అవసరమైన పరిమాణంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎరువుల పర్యవేక్షణపై జా యింట్ కలెక్టర్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల కొరతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న విషయం రైతులకు వివరించాలన్నారు. మండలాల వారీగా అధికారులు పర్యవేక్షించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎరువుల దుకాణాలపై పటిష్ట పర్యవేక్షణ ఉండాలని, కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించిన చర్యలు తీసుకుని అవసరమైతే సీజ్‌చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలే లక్ష్యం: సబ్‌కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్
పాలకొండ: ప్రజలకు రెవెన్యూ సేవలు సక్రమంగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని సబ్‌కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. పాలకొండ సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ‘సాక్షి’తో మంగళవారం మాట్లాడారు. సివిల్స్ శిక్షణ అనంతరం మొదటిసారిగా ఇక్కడ బాధ్యతలు చేపట్టినట్టు వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్థపై పూర్తి అవగాహన పెంచుకుని ప్రజలకు మంచి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
చదువులో ప్రతిభ చూపుతూ...
స్వప్నిల్ జగన్నాథ్‌ది మహారాష్ట్రలోని నాసిక్. సామాన్య కుటుంబం. తండ్రి జగన్నాఽథ్ పవార్ ఆటోడ్రైవర్. తల్లి కల్పన గృహిణి. సోదరి పూజకు వివాహం అయింది. పూనేలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన స్వప్నిల్ చదువులో రాణిస్తూ మొదటి ప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. రెండో ప్రయత్నంలో ఐపీఎస్, మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. 2023 ఐఏఎస్ బ్యాచ్‌లో ఆయన శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇదే బ్యాచ్‌కు చెందిన వైశాలిని 2025లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా విధుల్లో చేరారు.
డీఎస్సీలో రాణించిన తాళ్లడుమ్మ యువకుడు
జియ్యమ్మవలస: మండలంలోని తాళ్లడుమ్మ గ్రామానికి చెందిన తుమరాడ దుర్గాప్రసాదరావు స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)లో 89.62 మార్కులు సాధించాడు. పీజీటీ (తెలుగు)లో 84.5, టీజీటీ (తెలుగు) 77.67 మార్కులు వచ్చాయి. డీఎస్సీలో కుమారుడు ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు పద్మావతి, వెంకటరమణ సంతోషపడుతున్నారు.