
రెడ్‌బుక్ రాజ్యాంగం మాకొద్దు
గుమ్మలక్ష్మీపురం: కూటమి ప్రభుత్వ చర్యలు విద్యార్థులు, ఉపాధ్యాయుల స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులను హరించేలా ఉన్నాయి. విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలపై ప్రశ్నించే విద్యార్థి సంఘాలను నియంత్రించి, వారి గొంతును అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. పాఠశాలల్లోకి రాజకీయ పార్టీల, విద్యార్థి సంఘాల నాయకులకు ప్రవేశాన్ని నిషేధిస్తూ జీఓ విడుదలచేయడం దుర్మార్గం. రాజ్యాంగం కల్పించిన హక్కులకు సంకెళ్లువేస్తూ నిరంకుశ పాలనను కొనసాగిస్తోంది. ఈ రెడ్‌బుక్ రాజ్యాంగం పాలన మాకొద్దంటూ విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నారు. విద్యను వ్యాపారంగా మార్చడం, వసతి గృహల్లో నాసిరకమైన వసతులు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు కోసం అధిక ఫీజు వసూళ్లు, అధిక ధరలకు పుస్తకాలు అమ్మడం, బకాయిపడిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో ప్రభుత్వానికి భయంపట్టుకుందన్నారు. అందుకే నిషేధ ఉత్తర్వులతో సంకెళ్లు వేయాలని చూస్తోందన్నారు.
ఉత్తర్వులు రద్దు చేయాలి
పాఠశాలలు, కళాశాలల ఆవరణలోకి విద్యార్థి సంఘాలకు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు విద్యార్థుల హక్కులను కాలరాసేదిగా ఉంది. ప్రైవేటు విద్యను ప్రోత్సాహించేలా.. విద్యార్థి సంఘాల గొంతు నులిపేలా ఉన్న ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేయాలి.
– బిడ్డిక అనీల్,
ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి, కురుపాం
ఆంక్షలు దుర్మార్గం
ప్రభుత్వ బడుల్లో, సంక్షేమ హాస్టళ్లలు/ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారమయ్యేందుకు విద్యార్థి సంఘాలు అనేక రకాల ఉద్యమాలు చేస్తూ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తుంటాయి. ఆంక్షల పేరుతో విద్యా సంస్థల్లోకి అనుమతులు లేకుండా జీఓలు జారీ చేయడం దుర్మార్గం. సమస్యలు వెలుగులోకి రాకూడదనే ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహారిస్తోంది.
– ఎ.గంగారావు, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి,
గుమ్మలక్ష్మీపురం
●
కూటమి పాలనపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

రెడ్‌బుక్ రాజ్యాంగం మాకొద్దు