
సీతంపేట ఐటీడీఏ పీఓ ఎవరు?
సీతంపేట: సీతంపేట సమగ్ర గిరిజనాభ్యుదయ సంస్థకు (ఐటీడీఏ) ప్రాజెక్టుఅధికారి ఎవరనేది స్పష్టత లేదు. పాలకొండ సబ్‌కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి ఇంతవరకు ఇన్‌చార్జ్ పీఓగా విధులు నిర్వహించారు. ఆయన బదిలీ అయ్యారు. పాలకొండకు కొత్త సబ్‌కలెక్టర్‌గా పవర స్వప్నిల్ జగన్నాఽథ్‌ను నియమించారు. ఇప్పటికే ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఐటీడీఏ పీఓగా ఆయనకు ఎటువంటి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించలేదు. మూడు రోజులు కావస్తున్నా ఐటీడీఏ పీఓ ఎవరనేది స్పష్టత లేదు. ఎటువంటి ఇన్‌చార్జిలు లేకుండా ఐటీడీఏ పీఓను శాశ్వతంగా నియమిస్తారా?, స్వప్నిల్ జగన్నాఽథ్‌కు ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు ఇస్తారా అనేది చర్చనీయంశమైంది. సీతంపేట ఐటీడీఏకు పీఓ ఎవరనేదానిపై పూర్తిస్థాయిలో ఎవరికీ క్లారిటీ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు ఐటీడీఏకు శాశ్వతంగా పీఓను నియమించలేదు. ఇంచార్చిలతోనే నెట్టుకొస్తోంది.
బాధ్యత ఎవరు వహిస్తారు?
సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్‌ప్లాన్ మండలాలు ఉన్నాయి. నాలుగు మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండగా, మరో 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. సీతంపేట, కొత్తూరు, భామిని, హిరమండలం, మందస, మెళియాపుట్టి, పాతపట్నం మండలాలు ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (టీపీఎంయూ) విభాగంలో ఉన్నాయి. మొత్తం 1250కు పైగా గిరిజన గ్రామాలున్నాయి. 2 లక్షల మంది జనాభా ఉన్నారు. ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, క్షేత్రస్థాయిలో పథకాలు అమలు వంటివి చూడాల్సిన బాధ్యత ఐటీడీఏ పీఓపై ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో ఐటీడీఏ పీఓలను నియమించి పాలనా పరమైన ఇబ్బందులు లేకుండా చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎటువంటి పాలకవర్గ సమావేశాలు సైతం నిర్వహించిన దాఖలాలు లేవు. ఐటీడీఏలను నిర్వీర్యమైపోయే స్థాయికి వచ్చాయని పలువురు గిరిజన నాయకులే ఆరోపిస్తున్నారు. చివరకు సీతంపేట ఐటీడీఏకు ఐటీడీఏ చైర్మన్ ఎవరనేది కూడా స్పష్టత లేదు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, పార్వతీపురం మన్యం కలెక్టర్ వీరిద్దరిలో ఎవరనే సందిగ్దం అధికారుల్లోనే ఉండడం కొసమెరుపు.