
హైకోర్టు జడ్జిని కలిసిన ఎమ్మెల్సీ
పాలకొండ: ఇటీవల హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసిన గేదెల తుహిన్‌కుమార్‌ను ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సోమవారం విజయవాడలో మర్యాద పూర్వకంగా కలిశారు. వీరఘట్టం ప్రాంతానికి చెందిన తుహిన్‌కుమార్ జడ్జిగా నియమితులు కావడంతో ఆయన కలిసి అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు మండల కన్వీనర్ కనపాక సూర్యప్రకాశరావు ఉన్నారు.
బాధ్యతల స్వీకరణ
పార్వతీపురం రూరల్/పాలకొండ: జిల్లాలో పార్వతీపురం, పాలకొండ సబ్‌కలెక్టర్లుగా ఆర్. వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్‌లు సోమ వారం బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరూ 2023 సివిల్స్ బ్యాచ్‌కు చెందిన అధికారులు. ముందుగా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరికి కలెక్టర్‌తో పాటు ఎస్పీ అభినందనలు తెలిపారు. ఇంతవరకు ఇక్కడ సబ్ కలెక్టర్లుగా పనిచేసిన అశుతోష్ శ్రీవాస్తవ, యశ్వంత్‌కుమార్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది.
జీతాలు అడిగితే కేసులా... ఇదెక్కడి అన్యాయం బాబూ..
పార్వతీపురం రూరల్: మక్కువ మండలం డి.శిర్లాం వద్ద ఉన్న తాగునీటి పథకం నుంచి పార్వతీపురం మండలంలోని 66 గ్రామాలకు తాగునీటి సరఫరాలో కీలకభూమిక పోషిస్తున్న ఆపరేటర్లకు ఏడునెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు విన్నవించినా ఫలితం లేదని స్థానిక విలేకరుల వద్ద సోమవారం వాపోయారు. జీతాలు అందకపోవడంతో 23 మంది ఆపరేటర్ల కుటుంబాలు పస్తులతో గడపాల్సి వస్తోందని, తమ సమస్యను అధికారులు అర్థం చేసుకోవాలని కోరారు. జీతం బకాయిలు చెల్లించకుండా, తిరిగి విధులకు హాజరుకోకాపోతే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇదెక్కడి అన్యాయమన్నారు. తక్షణమే జీతాల చెల్లింపునకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థుల ప్రాణాలు కాపాడండి
గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురం రూరల్: ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాల్లో గతంలో పనిచేసిన ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని నియమించి గిరిజన విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు పాలక రంజిత్‌కుమార్, పల్ల సురేష్, ఆరిక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారంతా సోమ వారం అమరావతి సచివాలయంలో గిరిజన సంక్షేమ ముఖ్యకార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. గురుకుల, ఏకలవ్య, కేజీబీవీ, జ్యోతిరావుపూలే విద్యాసంస్థల్లో ఏఎన్‌ఎంలు ఉన్నారని, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో వైద్య సిబ్బంది లేకపోవడంతో సేవలు అందడంలేదన్న విషయాన్ని కార్యదర్శికి తెలియజేశామన్నారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీఓలను కొనసాగించాలని, పాలకవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి గిరిజన సంక్షేమ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. కార్యదర్శిని కలిసిన వారిలో సంఘాల నాయకులు గణేష్, శ్రీరంజని, సుభాషిని, నిర్మల, సత్యవతి, సంతోషి ఉన్నారు.

హైకోర్టు జడ్జిని కలిసిన ఎమ్మెల్సీ

హైకోర్టు జడ్జిని కలిసిన ఎమ్మెల్సీ