
ఉత్తమ పాఠశాలగా వంగర కేజీబీవీ
వంగర: రాష్ట్రస్థాయి ఉత్తమ పాఠశాల అవార్డుకు వంగర కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ఎంపికై ంది. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 352 అన్ని యాజమాన్య పాఠశాలల్లో టాప్–10 పాఠశాలలను ఎంపిక చేయగా అందులో వంగర కేజీబీవీ ఉందన్నారు. కేజీబీవీలలో విద్యార్థుల హాజరు, విద్యాప్రమాణాలు, విద్యార్థుల సరాసరి మార్కులు, ఉత్తీర్ణత శాతం, గత ఏడాది 10వ తరగతి ఉత్తీర్ణత శాతం, గరిష్ఠంగా వచ్చిన గణాంకాలు ఆధారంగా ఎంపిక చేశారు. ఆగస్టు 15 పర్వదినాన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా ప్రిన్సిపాల్ బౌరోతు రోహిణి, సిబ్బంది అవార్డులు అందుకోనున్నారు. రాష్ట్ర స్థాయిలో కేజీబీవీకి ఉత్తమ అవార్డు లభించడం పట్ల కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హర్షం వ్యక్తంచేశారు. డీఈఓ యు.ముత్యాలునాయుడు, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త ఎ.రామారావు, స్పెషల్ ఆఫీసర్ బౌరోతు రోహణి, సిబ్బందిని అభినందించారు. గతంలో కూడా వంగర కేజీబీవీ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికై ంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవార్డును ప్రదానం చేశారు.
ఆనందంగా ఉంది
కేజీబీవీ విద్యాలయంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నాం. ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్నాం. ఈ ఏడాది కూడా ఉపాధ్యాయులు కష్టపడి పని చేశారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించినందుకు అవార్డు దక్కింది. అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. కలెక్టర్, డీఈఓ, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తకు కృతజ్ఞతలు. ఈ ఏడాది కూడా మంచి ఫలితాల సాధనకు కృషిచేస్తాం. – బౌరోతు రోహిణి,
స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ, వంగర
ఆగస్టు 15న సీఎం చేతుల మీదుగా అవార్డు ప్రదానం
ప్రకటించిన కలెక్టర్ అంబేడ్కర్

ఉత్తమ పాఠశాలగా వంగర కేజీబీవీ