
కొఠియా పల్లెల్లో నోటీసుల అలజడి
సాలూరు: రాజ్యాంగం కల్పించిన భావస్చేచ్ఛ హక్కును వినియోగించుకోవడమే వారు చేసిన తప్పు. తామంతా ఆంధ్రావైపు ఉంటామని పదేపదే పునరుద్ఘాటిస్తుండడమే వారు చేసిన నేరం. వీరిపై ఒడిశా పోలీసులు, అధికారులు కన్నెర్ర చేశారు. కేసులున్నాయంటూ ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొఠియా గ్రూపు గ్రామాల్లోని పలువురు గిరిజనులు, నాయకులకు నోటీసులిచ్చి ఆందోళనకు గురిచేస్తున్నారు. మూడు రోజుల కిందట కొంతమందికి నోటీసులిచ్చిన ఒడిశా పోలీసులు సోమవారం మరికొందరికి అందజేశారు. తాము ఏం తప్పుచేశాం.. ఎందుకు నోటీసులు ఇస్తున్నారని ప్రశ్నించగా గతంలో కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. కేసులు ఎప్పుడు నమోదయ్యాయన్న ప్రశ్నకు ఒడిశా పోలీసుల వద్ద సమాధానం లేదు. తామంతా ఆంధ్రాకు అనుకూలంగా ఉంటున్నామని ఈ విధంగా తమపై తప్పుడు కేసులు నమోదుచేసి, నోటీసులతో ఇబ్బందులుకు గురిచేస్తున్నారంటూ కొఠియా గ్రూపు గ్రామాల గిరిజనులు వాపోతున్నారు. ఆంధ్రా పాలకులు, అధికారులు స్పందించి అండగా ఉండాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొఠియా గ్రూపు గ్రామాల ప్రజలను పట్టించుకోవడలేదని, తరచూ ఒడిశా అధికారులు దాడులు చేస్తున్నా కనీసం స్పందించడంలేదని వాపోతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల బోర్డులు పీకేయడం, సామగ్రిని తీసుకెళ్లిపోవడం, జల్‌జీవన్ మిషన్ పథకం సామగ్రిని స్టేషన్‌కు తరలించడం వంటి ఘటనలు పరిపాటిగా మారాయి. ఆంధ్రా, ఒడిశాలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొఠియా సమస్య పరిష్కారానికి చొరవచూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేసులున్నాయంటూ పలువురికి నోటీసులు జారీచేసిన ఒడిశా పోలీసులు
ఆంధ్రాకు అనుకూలంగా ఉండడమే కారణమని వాపోతున్న గిరిజనులు