
విద్యార్థుల హక్కులను హరిస్తే ఊరుకోం
గుమ్మలక్ష్మీపురం: పాఠశాలలు, కళాశాలల ఆవరణలోకి విద్యార్థి సంఘాలకు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బి.అనీల్, మండల కార్యదర్శి ఎ.గంగారావు, యూటీఎఫ్ మండల కార్యదర్శులు శంకరరావు, చలపతి, గిరిజన సంఘం జిల్లా కోశాధికారి ఎం.రమణ, సీఐటీయూ మండల సభ్యులు ఎం.సన్యాసిరావు డిమాండ్ చేశారు.
గుమ్మలక్ష్మీపురం గిరిజన సంఘం కార్యాలయం వద్ద సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల ఆవరణలోకి విద్యార్థి సంఘాల నాయకులకు అనుమతి లేదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విద్యార్థుల హక్కులను కాలరాసేదిగా ఉందన్నారు. విద్యార్థి సంఘాలు విద్యార్థుల హక్కులకై మాత్రమే నినదిస్తాయని, ప్రైవేటు విద్యను ప్రోత్సాహించేందుకు, విద్యార్థి సంఘాల గొంతునులిపేందుకు తీసుకొచ్చిన ఉత్తర్వులను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించారు.