
ఉచిత బస్సుపేరుతో కార్మికుల పొట్ట కొట్టొద్దు
● కలెక్టరేట్ ఎదుల ఆటో డ్రైవర్ల ఆందోళన
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో పలు మండలాలకు చెందిన వందలాదిమంది ఆటో కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా పట్టణ ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తే ఆటో కార్మికులలో 60శాతం మందికి ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెట్టినప్పుడు దాని ప్రభావం వల్ల ఎంతమంది నష్టపోతారో ఆలోచన చేసి పరిశీలించి శాసీ్త్రయంగా నష్టపరిహారాన్ని, ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక విధాలుగా ఉపాధిలేక అవస్థలు పడుతున్న ఆటో కార్మికుల పరిస్థితి ఈ ఉచిత బస్సుతో మరింత దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం వారికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పింఛన్లు వంటివి చెల్లించి వాహన మిత్ర తరహాలో పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్‌కు ఏడాదికి రూ. 25వేలు పరిహారం చెల్లించాలని, అలాగే ఇప్పటికే తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రభుత్వం రూపొందించకపోతే ఆటో, ట్యాక్సీ కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా కార్యదర్శి వై.మన్మథరావు, బీవీ రమణ, కోశాధికారి జి.వెంకటరమణ, కె.గంగునాయుడు, సాంబమూర్తి, ఉమామహేశ్వరరావు, ఆటో యూని యన్ నాయకులు శంభాన చిన్న, డి. రాము, క్రాంతి, నారాయణ, సత్యనారాయణ, శ్రీను, శంకరరావు , పోలినాయుడు, తదితరులు పాల్గొన్నారు.