
50వేల బంగారు కుటుంబాల దత్తత
విజయనగరం అర్బన్: ఆగస్టు 15 నాటికి 50వేల బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. పీ4 కార్యక్రమం, హర్ ఘర్ తిరంగా, సీజనల్ వ్యాధులు, భారీ వర్షాలు తదితర అంశాలపై ఆన్‌లైన్‌లో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో మొదట 67,066 బంగారు కుటుంబాలను గుర్తించగా, వడపోతల అనంతరం ఆ సంఖ్య 60,612 కు తగ్గిందని కలెక్టర్ చెప్పారు. ఇంకా ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆగస్టు 15 నాటికి జిల్లాలో 50వేల బంగారు కుటుంబాల దత్తతను పూర్తిచేయాల్సి ఉందని, మార్గదర్శులను గుర్తించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, ఫొటోలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, సీపీఓ పి.బాలాజీ, జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
భారీ వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్