
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిచుకోవాలి
పార్వతీపురం రూరల్: పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆ పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరలక్ష్మి డిమాండ్ చేశారు. భోజన పథకం యూనియన్ జిల్లా రెండో మహాసభలు జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వరలక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ పథకంలో దేశంలో 25 లక్షల మంది, రాష్ట్రంలో 85 వేల మంది సిబ్బంది నిర్వహణలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలే అన్న విషయం పాలకులు గుర్తించాలన్నారు. ఇందులో ఎక్కువగా వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారని వెల్లడించారు. మహిళ సాధికారత కోసం జపించే పాలకులు 11 సంవత్సరాలుగా భోజన కార్మికుల వేతనాలు పెంచకపోవడం బాధాకరమన్నారు. యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బి.సుధారాణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నాయని చెప్పారు. విద్యార్థికి కనీసం రూ.20 మెనూ చార్జీలు ఇవ్వాలని, జాతీయ విద్యా విధానం 2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రమణారావు, వై.మన్మధరావు, జిల్లా ఉపాధ్యక్షులు వి.రామలక్ష్మి, జిల్లా కోశాధికారి వెంకటరమణ, అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
అనంతరం జిల్లా యూనియన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా జి.తులసి, ప్రధాన కార్యదర్శిగా వై.శాంతికుమారి, కోశాధికారిగా కె.మీనాకుమారి, జిల్లా కమిటీ సభ్యులుగా యు.లక్ష్మి, కె.ఉష, పావణి, కళ్యాణి, సుశీల, గౌరమ్మ, రజని, సావిత్రమ్మ, షబానా ఎన్నికయ్యారు.
భోజన పథకం కార్మిక యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు వరలక్ష్మి