
కోటదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి చర్యలు
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం అభివృద్ధికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ఏన్నో ఏళ్లుగా ఆలయానికి ఆనుకుని ఉన్న స్థలం అమ్మవారి ఆలయానికి కేటాయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంత మేరకు ఫలించాయి. ఆలయానికి ఆనుకుని ఉన్న ప్రైవేటు వ్యక్తుల స్థలం అమ్మవారి ఆలయానికి ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఆలయ పరిసరాల్లో జేసీబీలతో చదును చేస్తున్నారు. వాస్తవానికి కోటదుర్గమ్మ ఆలయం సమీపంలో పశువుల ఆసుపత్రి ఉంది. ఈ స్థలం ఆలయానికి అందించి, అందుకు దేవదాయ శాఖకు చెందిన స్థలం మరో చోట అందించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదన ఇంతవరకు పూర్తి కాలేదు. ఇదే సమయంలో ఆలయం పక్కనే ఉన్న కళాభారతి భవనాల స్థలం పట్టణానికి చెందిన పైడి కృష్ణప్రసాద్ ఆలయానికి అందించారు. దీంతో కొంత స్థల సమస్య తీరింది. పశువుల ఆసుపత్రి స్థలం కూడా ఆలయానికి అందిస్తే అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది.
రూ.10లక్షలతో పనులు
ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో రూ.10లక్షల మేర ఖర్చు చేసి స్థలం చదును చేసేందుకు పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక వేత్త పల్లా కొండలరావు ముందుకు వచ్చారు. గత నాలుగు రోజులుగా జేసీబీలతో పనులు చేయిస్తున్నారు. దసరా ఉత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ పనులు పూర్తి చేస్తున్నారు.