
శ్రీనిధిలో మెరుగైన వైద్య సేవలు
● ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి
కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం ఫోర్ట్: ఆస్పత్రికి వచ్చే రోగులకు సేవాదృక్పథంతో వైద్య సేవలు అందించాలని ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు విజయనగరం పట్టణంలోని ఐనాక్స్ థియేటర్ వెనుక నూతనంగా నిర్మించిన శ్రీనిధి మెడికేర్, క్రిటికల్ కేర్, మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని వినియోగించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. జిల్లా కేంద్రంలో అన్ని రకాల వైద్య సేవలతో కూడిన శ్రీనిధి మెడికేర్, క్రిటికల్ కేర్ ఆస్పత్రి అందుబాటులోకి రావడం శుభపరిణామమన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవల కోసం గతంలో విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పడు జిల్లా కేంద్రంలో అందుతున్నాయన్నారు. ఆస్పత్రి ఎం.డి డాక్టర్ వి. నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, ఐసీయూ, జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యురాలజీ, పలమనాలజీ సేవలు అందిస్తామన్నారు. డయాలసిస్, ఎక్స్‌రే, ల్యాబొరేటరీ, సిటిస్కాన్, ఫిజియోథెరపీ, క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, మాడ్యులర్, లామినర్ ఆపరేషన్ థియేటర్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆస్పత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎం. జయచంద్రనాయుడు పాల్గొన్నారు.