
ధర లేదు...!
కళ తప్పిన చంపావతి
గజపతినగరం:ప్రతి ఏటా ఇదే సీజన్‌లో నీటి తో నిండుగా దర్శనమిచ్చే చంపావతి నది నేడు నీరు లేక పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. వర్షాలు కురవకపోవడంతో నదిలో పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. మరోవైపు ఇసుకాసురులు ఎక్కడికక్కడ గోతులు తవ్వేసి ఇసుకను ఎత్తుకెళ్లడంతో మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఆగస్టు నాటికి నీటితో నిండుగా ఉండాల్సిన చంపావతి నేడు జల కళ తప్పి బోసిపోయింది. ఈ పరిస్థితుల్లో దీని ఆయకట్టు రైతులు సాగుపై ఆందోళన చెందుతున్నారు.
గజపతినగరంలో నీరు లేక పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న చంపావతి నది
దిగుబడి
పెరిగినా..
గిరిజన ఉత్పత్తులకు సరైన ధర ఏ సీజన్‌లోనూ రాక రైతులు నష్టపోతున్నారు. ఏజెన్సీలో పండే ప్రతి ఉత్పత్తిని జీసీసీ కొనుగోలు చేసి గిరిజనులకు మేలు చేయాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం లేకుండా పోయింది. సీజన్ వారీగా మార్కెట్‌లోకి వచ్చే పండ్ల దిగుబడి బాగున్నా... ధర లేకుండా పోవడంతో గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. పంట దిగుబడులు విక్రయించే సమయానికి వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గించేసి వారు మాత్రం లాభాలు పొందుతున్నారు. ఏజెన్సీలో తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యాపారులు మైదాన ప్రాంతాలకు తరలించి అక్కడ లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో గిరిజన రైతులు ఏ సీజన్‌లోనూ లాభపడే పరిస్థితులు కనిపించడం లేదు.
సీతంపేట: ప్రస్తుత సీజన్‌లో ఏజెన్సీలో పండించిన కొన్ని రకాల పండ్లకు ధరలు ఉన్నా.. మరికొన్ని రకాల పంటలకు మద్దతు ధరలు లేవని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఆ కోవకే వస్తుంది విస్తృతంగా పండే పుట్టదబ్బ. ఏజెన్సీలో ఈ ఏడాది పుట్టదబ్బ దిగుబడి పెరిగినా ధరలు అంతగా అనుకూలించడం లేదు. ఫలితంగా గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతగా పెట్టుబడులు అక్కర్లేక పోయినప్పటికి భామిని, సీతంపేట ఏజెన్సీలో ఈ పంటను కొండ పోడు వ్యవసాయంలో భాగంగా గిరిజన రైతులు పండిస్తారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తుందని గిరిజన రైతులు వాపోతున్నారు. కావిడ దబ్బ ధర రూ 300 – 400ల మధ్య విక్రయిస్తున్నామని గిరిజనులు తెలిపారు. గతేడాది ఇదే సీజన్లో ఒక్కో కావిడి రూ.500 వరకు విక్రయించే వారమని గిరిజనులు చెబుతున్నారు. హడ్డుబంగి, సోమగండి, గొయిది, శంబాం, కుశిమి, పెదరామ తదితర పంచాయతీల పరిధిలో దబ్బ ఎక్కువగా సాగు చేస్తున్నారు.
మైదాన ప్రాంతాల్లో డిమాండ్
ఒక్కో పుల్ల దబ్బ ఏజెన్సీలో రూ.4లకు కొనుగోలు చేసి మైదాన ప్రాంతాల్లో రూ.10ల వరకు విడిగా విక్రయిస్తారు. కారుచౌకగా కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లో అధికంగా విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తారు. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయిలో కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలు జరుగుతాయి. ఈ సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. ఎక్కువగా ఇవి పచ్చళ్లు తయారు చేసే చిన్నతరహా కంపెనీలకు విక్రయిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. గిరిజన రైతులు చెప్పిన ధరలు కాకుండా వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరలకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా దళారీ వ్యాపారుల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో ఆ పంటను వ్యాపారులకు ఇస్తారు. ఇలా కూడా గిరిజనులు నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
ఏజెన్సీలో పుట్టదబ్బ పరిస్థితి
కావిడ దబ్బ రూ.300 నుంచి 400
ఒక్కో పుట్టదబ్బ రేటు ఏజెన్సీలో రూ.4లు
మైదాన ప్రాంతాల్లో రూ.10లు
ఆందోళనలో గిరిజన రైతులు
దబ్బకు మద్దతు ధర కల్పించాలి
కొండపోడు వ్యవసాయంలో పండిస్తాం కాబట్టి సేకరణ కష్టంగా ఉంటుంది. పోడు వ్యవసాయంలో అక్కడక్కడ చెట్లు ఉంటాయి. తెల్లారే సరికి కొండకు వెళ్లి సేకరించి వారపు సంతల్లో విక్రయిస్తాం. గత కొన్నేళ్లుగా ఇవే ధరలు ఉంటున్నాయి.
– ఎస్.మోజేషు,
లంబగూడ
శ్రమకు తగ్గ ఫలితం లేదు..
పైనాపిల్, సీతాఫలం తర్వాత ఆదాయాన్ని ఇచ్చేది పుట్టదబ్బ పంట. శ్రమకు తగ్గ ఫలితం లేదు. కావిడలు మోసుకొని తీసుకువస్తాం. తీరా వీటిని తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తుంది. ప్రత్యేక మద్దతు ధరలు లేవు. దీంతో వ్యాపారులు నిర్ణయించిన ధరలకు అమ్మకాలు చేస్తున్నాం.
– ఎస్.బంగారయ్య, కొత్తగూడ

ధర లేదు...!

ధర లేదు...!

ధర లేదు...!