
అటకెక్కిన వాహనమిత్ర
హామీల అమలుకు ర్యాలీ
ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాహనమిత్ర హామీతో పాటు మోటారు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డ్రైవర్లు, మోటారు కార్మికులు డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు అమలు చేసే లోపు వాహనమిత్ర అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం డ్రైవర్లు, కార్మికులు సాలూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఇందులో వందల సంఖ్యలో డ్రైవర్లు, కార్మికులు పాల్గొన్నారు.
సాలూరు: చక్రం కదిలితేనే వారి బతుకు బండి సాగేది. దశాబ్దాలుగా వారి జీవనాధారం ఆటోలే.. సాలూరు నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లు వందల సంఖ్యలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వీరికి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఏటా అమలయ్యేది. ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేయడం ద్వారా రూ.వేల లబ్ధి చేకూరేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాహన మిత్ర కింద రూ.15వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరచి విస్తృత ప్రచారం కల్పించారు. దాన్ని నమ్మి వీరంతా కూటమికి ఓటేశారు. ఇప్పుడు మోసపోయామని గుర్తించారు. ఆందోళన చెందుతున్నారు. జగనన్న ప్రభుత్వంలో ఏటా వాహన మిత్ర పథకం తమకు అందేదని ఇప్పుడు దాన్ని కూటమి పాలకులు పక్కన పెట్టారని వాపోతున్నారు.
డ్రైవర్ల ఆందోళన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహన మిత్ర పథకం కింద ఇస్తామన్న రూ.15వేలు నేటికీ ఇవ్వలేదు. ఆ ఊసేత్తడం లేదు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం రూ.400 కోట్లు బడ్జెట్ కేటాయించి నాడు అర్హులందరికీ రూ.పది వేల చొప్పున అందించారు. కూటమి ప్రభుత్వం ఆ మాదిరిగానే ఇస్తుందని ఆశించిన డ్రైవర్లకు నిరాశే మిగిలింది. ఇదే సమయంలో సీ్త్రశక్తి కింద మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకువస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు ప్రకటించిన క్రమంలో తమ బతుకు బండి సంగతేంటని వారంతా ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం ఆటో, ట్యాక్సీ వాలాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పథకానికి తాము వ్యతిరేకం కాదని తమను కూడా ఆదుకోవాలని కోరుతున్నారు.
వాహన మిత్ర అమలు చేయాలి
కూటమి ప్రభుత్వం వాహనమిత్ర కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. జీవో 21 రద్దు చేసి అపరాధ రుసుం భారం తగ్గిస్తామని చెప్పారు. వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని, వాహన కొనుగోలుకు సంబంధించి వడ్డీపై సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదైనా నేటికీ అవేమి అమలు కావడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ చెబుతున్నారు.. ఈ క్రమంలో అంతకంటే ముందు వాహనమిత్ర అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడుతాం.
– ఎన్‌వై నాయుడు, ఆటో, మ్యాక్సీ,
క్యాబ్ యూనియన్ గౌరవాధ్యక్షుడు,
సీఐటీయూ జిల్లా కార్యదర్శి
డ్రైవర్లకు కూటమి నేతలు ఇచ్చిన హామీలు ఇలా..
ఎన్నికల సమయంలో కూటమి నేతలు డ్రైవర్లకు అమలు కాని హామీలు ఇచ్చారు. బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. జీవో 21 రద్దు చేసి ఫైన్‌ల భారం తగ్గిస్తామని, వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని, డ్రైవర్లను యజమానులను చేసే లక్ష్యంతో వాహన కొనుగోలుకు రూ.4 లక్షల వరకు పొందే రుణాలపై ఐదు శాతం పైబడిన వడ్డీ సబ్సిడీ అందిస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇందులో ఏ ఒక్కటీ అమలు కావడం లేదు.
మేనిఫెస్టోలో హామీనిచ్చి మరిచారు
నిరాశలో ఆటో డ్రైవర్లు
మహిళలకు ఉచిత బస్సు అమలైతే.. తమ పరిస్థితి ఏంటని ఆందోళన
సాలూరులో వందల మంది ఆటో డ్రైవర్లు
వాహనమిత్ర అమలు చేయాలని భారీ ర్యాలీ

అటకెక్కిన వాహనమిత్ర