
అధికారుల బదిలీలపై ఆగ్రహం
గుమ్మలక్ష్మీపురం: పాలకొండ సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ సిన్హ, పార్వతీపురం ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీ వాస్తవకు చేపట్టిన బదిలీలను ప్రభుత్వం నిలుపుదల చేయాలని గిరిజన జేఏసీ నాయకులు కోలక లక్ష్మణమూర్తి, మండంగి రమణ, నిమ్మక సింహాచలం, బి.గౌరీశంకరరావు, బిడ్డిక పద్మ, తిరుపతిరావు, అడ్డాకుల చిన్నారావు తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వారు గుమ్మలక్ష్మీపురంలో వారి బదిలీలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ కలెక్టర్‌గా యశ్వంత్ కుమార్ సిన్హ, పీవోగా అశుతోష్ శ్రీ వాస్తవ ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలోనూ, నిరుద్యోగ విద్యార్థుల ఉన్నత అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వీరిని బదిలీ చేయడం వలన ఇప్పటి వరకు గిరిజన గ్రామాల్లో జరిగిన అభివృధ్ధి ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం దీన్ని గుర్తించి వీరి బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని, లేకుంటే గిరిజనులంతా ఏకమై ఆందోళనలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
సబ్ కలెక్టర్, పీవో బదిలీలను నిలుపుదల చేయాలి
గిరిజన జేఏసీ నాయకుల డిమాండ్