
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న యోగా పోటీలకు జిల్లా జట్లు సిద్ధమయ్యాయి. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని తోటపాలెం గాయత్రీ విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ఎంపిక పోటీలకు అనూహ్య స్పందన లభించింది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో మొత్తం 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరికి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విక్రమ్, అల్లు నరేంద్ర, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు సమక్షంలో ఎంపికలు నిర్వహించారు. ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 35 మంది క్రీడాకారులను వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో తాడేపల్లిగూడేంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విక్రమ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.సన్యాసిరావు, ఎస్.రవివర్మ, ఎన్.పైడిరాజు, ఎం.గౌతమి, జి.సంధ్య తదితరులు పాల్గొన్నారు.