
పెద్ద గెడ్డ కాలువలో మృతదేహం లభ్యం
పాచిపెంట : పెద్దగెడ్డ జలాశయం కాలువలో ఓ వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైనట్టు పాచిపెంట ఎస్‌ఐ వెంకట్ సురేష్ శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరు పట్టణంలో గలగొడ వీధికి చెందిన ముంజేటి నాగేంద్రబాబు (40) ప్లాస్టిక్ కవర్లు సేకరిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. శనివారం కాలువలో శవమై కనిపించాడు. మృతునికి మద్యం అలవాటు ఉందని మద్యం మత్తులో బహిర్భూమి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడని భార్య ముంజేటి ఖరీస్మా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
వైభవంగా విఖనసస్వామి జయంతి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీసీతారామస్వామి దేవస్థానంలో కొలువైన విఖనసస్వామి జయంతి శనివారం వైభవంగా నిర్వహించారు. వేకువజామున సీతారామస్వామి వారికి ప్రాతఃకాలార్చన పూజలు నిర్వహించినానంతరం యాగశాలలో విశేష హోమాలు చేశారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తుల వద్ద స్వామివారికి నూతన యజ్ఞోపవీతధారణ చేశారు. అనంతరం వెండి మండపం వద్ద సీతారాముల నిత్యకల్యాణం కనుల పండువగా చేశారు. విఖనసస్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫలరసాలతో అభిషేకం చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, అర్చకులు పాల్గొన్నారు.